లాటరీ వచ్చిందని లాగేశారు!

10 Jun, 2017 19:33 IST|Sakshi
లాటరీ వచ్చిందని లాగేశారు!
సాక్షి, చిత్తూరు: లాటరీ తగిలిందంటే ఎందుకు సంతోషించరు. అయితే, ఆ లాటరీ ఏంటో? ఎందుకు తగిలిందో? మాత్రం తెలుసుకోకపోతే... ఇదిగో ఈ మహిళ తరహాలోనే మోసపోవాల్సి వస్తుంది. చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని అంగళ్లుకు చెందిన కె అనితకు ఒక మెసేజ్ వచ్చింది. ఆమె సెల్ ఫోన్ కు వచ్చిన మెసేజ్ ఏంటంటే... మీకు మంచి లాటరీ తగిలింది అని. అది కూడా ఏకంగా 79 లక్షల రూపాయల లాటరీ తగిలిందని... అంతే దాంతో ఏం చేయాలో అనితకు పాలుపోలేదు. కొంతసేపు అయోమయం. మరికొద్దిసేపు సంతోషం. 
 
లాటరీ తగిలింది కానీ చిన్న సమస్య ఉందని, మీరు ఇన్‌కమ్‌ టాక్స్, సర్వీస్ టాక్స్ క్లియర్ చేస్తే తప్ప ఆ డబ్బు మీ చేతికి అందదు అన్న చిన్న షరతు కూడా ఆ మెసేజ్ లో ఉంది. అనితకు ఏం చేయాలో అర్థంకాలేదు. ఇన్‌కమ్‌ టాక్స్, సర్వీస్ టాక్స్ లాంటి పదాలతో షరతులు విధించడంతో లాటరీ తగిలిందన్న విషయంలో అనితకు కొంత నమ్మకం ఏర్పడింది. ఎందుకైనా మంచిదని... అందులో వచ్చిన ఫోన్ నంబర్ ను సంప్రదించింది. ఆ నంబర్ కు ఫోన్ చేయగా, ఈ టాక్సులన్నీ కడితే తప్ప మీకు డబ్బు రాదని సమాధానమొచ్చింది. వారు చెప్పిన వివరాలతో అనితకు నమ్మకం కుదిరింది.
 
ఎంత టాక్స్ చెల్లించాలని అడగ్గా, 4.49 లక్షల మేరకు టాక్సులు చెల్లించాలని చెప్పారు. ఎలా చెల్లించాలో కూడా వివరించారు. అందుకు ఏకంగా ఎనిమిది బ్యాంకుల ఖాతా నంబర్లను ఇచ్చారు. ఇంకే.. అనిత ఏమాత్రం ఆలస్యం చేయకుండా డబ్బు సర్దుబాటు చేసుకుని 25 వేల రూపాయల నుంచి 75 వేల వరకు ఒక్కో బ్యాంకు ఖాతాలో నెల రోజుల్లోగా మొత్తం 4.49 లక్షల రూపాయలు జమచేసింది. డబ్బు జమ చేసిన ప్రతి సందర్భంలోనూ వారితో మాట్లాడారు. డబ్బు జమ చేసిన ప్రతిసారీ అనిత సెల్ ఫోన్ కు మెసేజ్ లు కూడా వచ్చాయి. మీరు చెల్లించాల్సిన టాక్స్ మొత్తం ఇంత మేరకు జమ చేశారన్న మెసేజ్ లు అనితలో మరింత నమ్మకం పెంచాయి.
 
వారు చెప్పిన మొత్తం జమ చేసిన తర్వాత ఇక తన ఖాతాలో సొమ్ము జమవుతుందని ఆశించిన అనితకు నిరాశే ఎదురైంది. ఎంతకూ లాటరీ సొమ్ము తన ఖాతాలో జమ కాకపోవడంతో అనితలో ఆందోళన పెరిగిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఏం చేయాలో అర్థం కాలేదు. అంతకుముందు ప్రతిసారీ సంప్రదించిన ఫోన్ నంబర్ కు కాల్ చేస్తే అక్కడి నుంచి సమాధానం రాలేదు. దాంతో మరింత టెన్షన్ పెరిగింది.
 
కొద్ది రోజులకుగానీ తాను చేసిన తప్పేంటో అర్థమైంది. మోసపోయానని గ్రహించింది. మోసపోయానని గ్రహించిన వెంటనే ముదివేడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనిత ఫిర్యాదు మేరకు ముదివేడు ఎస్ఐ వెంకటేశ్వర్లు అప్పటివరకు ఆమె డబ్బు జమ చేసిన ఖాతాల వివరాలు సేకరించి ఆయా బ్యాంకులకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో ఆయా ఖాతాల వివరాలు చూసి అంతా అవాక్కయ్యారు.
 
ఒక్కో బ్యాంకు ఖాతా ఒక్కో రాష్ట్రంలో ఉంది. అన్ని ఖాతాలు ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. ఆ బ్యాంకులన్నీ కోల్‌కతా, ఢిల్లీ, భోపాల్, మిజోరాం... తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. పైగా ఆ బ్యాంకు ఖాతాలన్నీ మహిళల పేరుతో ఉన్నాయి. ఈ వివరాలతో విజయవాడలోని సైబర్ క్రైమ్ స్టేషన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మాయ మాటలను నమ్మొద్దు. ఇలాంటి మెసేజ్ ల పట్ల తస్మాత్ జాగ్రత్త. 
మరిన్ని వార్తలు