అతడినే పెళ్లి చేసుకుంటా: ప్రియురాలు

15 Aug, 2018 13:48 IST|Sakshi
ఏనుగువానిలంకలో ప్రియుడు మురళీకృష్ణ ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న మేరీమాత, మహిళలు

సాక్షి, యలమంచిలి: తాను ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయాలని ఓ యువతి గ్రామస్తులు, కులపెద్దలు, ఐద్వా సంఘ మహిళలతో కలిసి ధర్నాకు దిగిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏనుగువానిలంకలో చోటుచేసుకుంది. గెద్దాడ మరియ మ్మ అనే యువతి బండి మురళీకృష్ణతో వివాహం చేయాలని ధర్నాకు దిగింది. వివరాలిలా ఉన్నాయి.. కలగంపూడిలోని తూర్పుపాలెంనకు చెందిన మేరీమాత ఏనుగువానిపాలెంకు చెందిన మురళీకృష్ణ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. శారీరకంగానూ ఒక్కటయ్యా రు. ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం మురళీకృష్ణ గల్ఫ్‌ దేశం వెళ్లగా మేరీమాత కూడా మరో గల్ఫ్‌ దేశం వెళ్లింది. ఇద్దరూ వేర్వేరు దేశాల్లో ఉపాధి పొందుతుండగా కొంతకాలానికి మురళీకృష్ణ స్వగ్రామానికి వ్యాపారం చేసుకుంటానని చెప్పి వచ్చాడు.

మురళీకృష్ణ వ్యాపారానికి మేరీమాత డబ్బులు కూడా పంపించింది. ఈ నేపథ్యంలో మురళీకృష్ణ అబ్బిరాజుపాలెంకు చెందిన మరో యువతితో వివాహానికి నిశ్చితార్థం చేసుకున్నాడు. విషయం తెలిసిన మేరీమాత హుటాహుటిన స్వగ్రామానికి రాగా మురళీకృష్ణ ఆమెకు కనిపించకుండా తిరుగుతున్నాడు. దీంతో మేరీమాత విషయాన్ని కులపెద్దలకు చెప్పి మురళీకృష్ణ ఇంటి వద్ద ధర్నాకు దిగింది.

ఇదిలా ఉండగా మేరీమాతను పెళ్లిచేసుకోవడానికి తనకు ఇష్టంలేదని, బలవంతంగా చేయాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని మురళీకృష్ణ తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పాడు. మురళీకృష్ణతో పెళ్లి జరిగేవరకూ వదిలేది లేదని మేరీమాత భీష్మించింది. ఇరు సంఘాల పెద్దలు బండి శ్రీనివాస్, గుబ్బల ఏడుకొండలు ఏనుగువానిలంక గ్రామ పెద్దలు మేళం రామాంజనేయులు, ముచ్చర్ల ధర్మరాజు, ఐద్వా సంఘం తరఫున పొత్తూరి జ్యోతి, జిల్లెళ్ల ప్రశాంతి, సీఐటీయూ మండల కార్యదర్శి దేవ సుధాకర్, సీపీఎం నాయకుడు మాసవరపు సుబ్బారావు తదితరులు మేరీమాతకు బాసటగా నిలిచారు.  

మరిన్ని వార్తలు