స్టేషన్‌ముందు వివాహిత నిరసన

15 Jun, 2019 10:29 IST|Sakshi

సాక్షి, జమ్మలమడుగు(కడప) : తనకు న్యాయం చేయాలంటూ ఓ వివాహిత పోలీస్‌ స్టేషన్‌ ముందు బైఠాయించింది. బాధితురాలి కథనం మేరకు..  పెద్దముడియం మండలం జంగాలపల్లెకు చెందిన మహబూబ్‌ప్యారీకి కర్నూల్‌జిల్లాకు చెందిన హుస్సేన్‌బాషాతో ఏడాది క్రితం పెళ్లయింది.  పెళ్లి సమయంలో 20తులాల బంగారం, నగదు, తదితర సామగ్రి ఇతనికి కానుకలుగా ఇచ్చారు. ఏడాది తిరగకమునుపే భార్యపై అనుమానం పెంచుకుని వేధించేవాడు. దీంతో తల్లిదండ్రులు తమకుమార్తెను  స్వగ్రామానికి తీసుకు  వచ్చారు.

ఈనేపథ్యంలో సంప్రదాయం ప్రకారం తలాక్‌ రాసిస్తే బంగారం తిరిగి ఇస్తామంటూ కొందరు పెద్దమనుషులు రంగంలోకి దిగారు. శుక్రవారం ఖాజీ  సయ్యద్‌ మహమ్మద్‌జిలాని వద్ద పెద్దమనుషులు ఆమెతో తలాక్‌ రాయించారు. వివాహ సమయంలో ఇచ్చినవి తిరిగిస్తామని చెప్పిన మధ్యవర్తులు మాటమార్చి రూరల్‌సీఐ కార్యాలయం వద్ద పంచాయితి పెట్టారు. చివరకు తాము ఇవ్వమని.. ఏంచేసుకుంటారో చేసుకోండంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులు కూడా నిందితుల పక్షం వహించారని భావించిన మహబూబ్‌ప్యారీ పోలీసు స్టేషన్‌ ముందు బైఠాయించింది. హుస్సేన్‌ బాషాను పోలీసుల సంరక్షించడం చూస్తుంటే తమకు న్యాయం కలగడం లేదని బాధితురాలి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. 

మరిన్ని వార్తలు