స్పందన: పన్నెండేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు..

10 Dec, 2019 14:32 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పన్నెండేళ్ల తర్వాత బిడ్డను కన్నవారి వద్దకు చేర్చడం ఆనందంగా ఉందని నగర సీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. స్పందనలో వచ్చిన కేసుల్లో ఎక్కువ కేసులు త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. వివరాలు.... 2007లో లత అలియాస్‌ ఆదిలక్ష్మి అనే అమ్మాయి తప్పిపోయింది. ఆమెను చేరదీసిన ఓ మహిళ తనను ఐదు వందల రూపాయలకు అమ్మేసింది. దీంతో తనను అక్కున చేర్చుకున్న మరో మహిళ లతను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసింది. అయితే కొన్నిరోజుల క్రితం తనను పెంచిన తల్లి మరణించడంతో తల్లిదండ్రుల వద్దకు చేర్చాలంటూ ‘స్పందన’ ద్వారా లత విజయవాడ పోలీసులను ఆశ్రయించింది. 

ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ ద్వారకా తిరుమల రావు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ‘లత తల్లిదండ్రుల ఆచూకీ కోసం మమ్మల్ని ఆశ్రయించింది. తన తల్లిదండ్రులు, సోదరుల వివరాలు చెప్పింది. ఈ‌ అంశాలన్నింటినీ మీడియా ద్వారా ప్రచారం చేశాం. ఈ క్రమంలో గుడ్లవల్లేరులో నివాసం ఉంటున్న మంగళగిరి లక్ష్మీ నారాయణ కుటుంబ సభ్యులు పోలీసులు ఆశ్రయించారు. 2007లో 13యేళ్ల వయస్సులో లత తప్పిపోయింది. ఈ విషయం గురించి అదే ఏడాది మార్చిలో కేసు నమోదైంది. అప్పట్లో హోంగార్డుగా ఉన్న లక్ష్మీ నారాయణ .. పోలీసులు సరిగా స్పందించలేదని ఉద్యోగం వదిలేశారు. ఈ విషయం ఆమెకు పూర్తిగా గుర్తు లేకపోవడంతో సంవత్సరం తప్పుగా చెప్పింది. దీంతో రేషన్ కార్డు, ఇతర ఆధారాలు కూడా వెరిఫై చేశాం. లత.. అలియాస్ ఆదిలక్ష్మి వారి కుమార్తె అనేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే శాస్త్రీయంగా నిర్దారణ కోసం పరీక్షలు చేయిస్తాం’ అని పేర్కొన్నారు.

ఐదు వందలకు అమ్మేసింది: ఆదిలక్ష్మి
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తల్లిదండ్రుల చెంతకు చేరుకోవడం పట్ల ఆదిలక్ష్మి హర్షం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నన్ను ఐదు వందలకు ఓ మహిళ అమ్మేసింది. నన్ను కొనుక్కున్న మధురిక అనే ఆమె చెన్నై తీసుకెళ్లి పెంచి పెళ్లి చేసింది. ఆమె చనిపోయాక నా కన్నవారిని కలవాలనిపించింది. అందుకు నా భర్త కూడా అంగీకరించి విజయవాడ తీసుకువచ్చారు. రామకృష్ణ అనే న్యాయవాదిని కలిసి విషయం‌ వివరించాం. ఆయన సూచన మేరకు స్పందనలో ఫిర్యాదు చేశాం. ఇప్పుడు నా తల్లిదండ్రులను కలవడం ఆనందంగా ఉంది’ అని పేర్కొంది.

ఉద్యోగం కూడా వదిలేశాను: లక్ష్మీ నారాయణ
‘నా కుమార్తె ఆదిలక్ష్మి గుడ్లవల్లేరులో 2007లో తప్పిపోయింది. పాపను వెతికేందుకు కుదరకపోవడంతో హోంగార్డు ఉద్యోగం కూడా వదిలేశాను. ఆ తర్వాత తిరుపతి, ఇతర ప్రాంతాలలో తిరిగినా పాప దొరకలేదు .ఇప్పుడు స్పందన ద్వారా నా కూతురు మా చెంతకు చేరడం ఆనందంగా ఉంది’ ఆదిలక్ష్మి తండ్రి లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశాడు.

>
మరిన్ని వార్తలు