అమ్మ కోసం..

6 Jun, 2020 08:02 IST|Sakshi
అమ్మకు అన్నం తినిపిస్తున్న చిన్న కుమారుడు వంశీ, పక్కన పెద్ద కుమారుడు భరత్‌

పేద తల్లిని కబళిస్తున్న కిడ్నీ వ్యాధి

పూట గడవని కుటుంబం

తల్లి కోసం చదువు మానేసిన కొడుకు

దాతల సాయానికి ఎదురు చూపులు  

అమ్మ చేతి ముద్దలు తినాల్సిన ప్రాయం.. ఆ ఇద్దరు పిల్లలది. ఇప్పుడు అమ్మకి అన్నీ తామే అయ్యారు. చావుకు దగ్గరవుతున్న ఆమెను బతికించుకునేందుకు వారు పడుతున్న ఆరాటం చూసిన వారి గుండె తరుక్కుపోతోంది. తమ చదువును కూడా పక్కన పెట్టి తల్లి సేవకు అంకితమైన ఆ పిల్లలు దాతలు స్పందించాలని ప్రాధేయపడుతున్నారు. 

కొత్తవలస (శృంగవరపుకోట): ప్రకాశం జిల్లా జాండ్రపేటకు చెందిన ఆలపాటి వెంకట సుబ్బారావు పొట్టకూటికి విశాఖపట్నం వలస వచ్చి ఊరూరా తిరుగుతూ అగరొత్తులు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అరకుకు చెందిన వెంకటపద్మను 2004లో వివాహం చేసుకుని విజయనగరం జిల్లా కొత్తవలసలో స్థిరపడ్డాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. 2018లో వెంకటపద్మ రెండు కిడ్నీలు పాడైపోవటంతో సుబ్బారావు తనకున్న దాంట్లో మూడేళ్లుగా వైద్యం చేయిస్తూ అప్పుల పాలైపోయాడు. వ్యాపారం నడవక.. వయసు మీరటంతో పూట గడవటమే కష్టమైన పరిస్థితుల్లో ఆమెకు మెరుగైన వైద్యం చేయించలేక సతమతమవుతున్నాడు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కిడ్నీ బాధితులకు ఇచ్చే రూ.10 వేల పింఛన్‌ ప్రస్తు తం వారిని ఆదుకుంటున్నా.. మందులకో సం దాతలపై ఆధారపడాల్సి వస్తోంది. 

బడికి దూరమైన పిల్లలు 
తల్లి అనారోగ్యంతో మంచం పట్టడంతో ఆమెకు సేవలందించేందుకు వారికి ఉన్న ఇద్దరు పిల్లలు మూడేళ్లుగా బడికి దూరమయ్యారు. పరిస్థితి తెలుసుకున్న జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆర్థిక సాయం అందించారు. తల్లిదండ్రులను ఒప్పించి పెద్ద కొడుకు భరత్‌కుమార్‌కు పుస్తకాలు కొనిచ్చి చదివిస్తుండగా ప్రస్తుతం 9 తరగతికి వచ్చాడు. చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు ఇచ్చే కూర, రసంతో కాలం గడుపుతున్నారు. చిన్నకొడుకు వంశీ మాత్రం మూడోతరగతితో చదువు మానేసి తల్లి ఆలనా పాలనా చూస్తున్నాడు.

నా పిల్లలు ఏమవుతారో.. 
నా రెండు కిడ్నీలు పోయాయి. నెలకు 12 సార్లు డయాలసిస్‌ చేయించుకోవాలి. నా ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. చదువుకొని ఆడుకోéల్సిన నా ఇద్దరు పిల్లల్లో ఒకరు స్కూల్‌ మానేసి నాకు సేవలు అందిస్తున్నాడు. పెద్దకొడుకు ఇంటిపనులు చేస్తున్నాడు. నాపిల్లలు ఏమవుతారో తెలియడం లేదు.      – ఆలపాటి వెంకట పద్మ 

వంట చేసి స్కూల్‌కెళ్తా.. 
ఉపాధ్యాయులు ఇచ్చిన ధైర్యంతో పాఠశాలకు వెళుతున్నాను. మా అమ్మ పరిస్థితి చూసి కొంత ఆర్థిక సాయం చేశారు. స్కూల్‌కు వెళ్లేముందు బొగ్గుల కుంపటిపై అన్నం వండి తమ్ముడికి అప్పగించి వెళ్తున్నా.. 
– భరత్‌కుమార్, పెద్ద కుమారుడు 

అందుకే బడికెళ్లడం మానేశా..
అమ్మకు రెండు కిడ్నీలు పోవటంతో ఏం చేయాలో తెలియడం లేదు. తలచుకుంటేనే ఏడుపు వస్తోంది. అమ్మకి సేవలు చేసేందుకు మాకు ఎవరూ లేరు. అందుకే నేను బడికి వెళ్లటం మానేశాను.
– వంశీ, చిన్న కుమారుడు

నైతిక విలువలున్న కుటుంబం 
కన్నతల్లికి రెండు కిడ్నీలు పాడవటంతో చూసుకోవడానికి రెండో కొడుకు పాఠశాలకు రావటం మానేశాడు. విషయం తెలుసుకుని తోటి ఉపాధ్యాయులంతా కొంత మొత్తం వేసుకుని కుటుంబానికి సాయం చేశాం. నైతిక విలువలున్న కుటుంబం వారిది.  
– కృష్ణవేణి, విశ్రాంత ఉపాధ్యాయిని 

సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌ 
స్పందించే దాతలు 90529 81811 ఫోన్‌నంబర్‌కు ఫోన్‌ చేసి సాయం అందించాలని ఆ కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది. 

మరిన్ని వార్తలు