‘ఎస్పీ సార్.. ఆత్మహత్య చేసుకుంటున్నా..’

1 Nov, 2014 00:22 IST|Sakshi
‘ఎస్పీ సార్.. ఆత్మహత్య చేసుకుంటున్నా..’

కాకినాడ క్రైం :తనతో తన స్నేహితులు మాట్లాడడం లేనందున తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఓ యువతి ఎస్పీ రవిప్రకాష్‌కు ఫోన్ చేయడం కాకినాడలో తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, బాధితురాలి కథనం ఇలా... పెద్దాపురం మండలం దివిలికి చెందిన ఎన్‌వీఆర్ లక్ష్మి అనే యువతి సర్పవరంలోని కోస్టల్ ఒకేషనల్ కాలేజీలో నర్సింగ్ ద్వితీయ సంవత్సర చదువుతోంది. నాలుగు రోజుల నుంచి తనతో స్నేహితులు మాట్లాడటం లేదని మనస్తాపంతో తాను ఆత్మహత్యచేసుకుంటున్నానని ఎస్పీ రవిప్రకాష్‌కు ఆమె ఫోన్ చేసింది. దీనిపై ఎస్పీ రవిప్రకాష్ వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు.
 
 ఆమెతో ఫోన్‌లో మాట్లాడి ఆమె ఎక్కడ ఉందో కనుక్కునే ప్రయత్నం చేశారు. తాను కాకినాడ రేచర్లపేట రైల్వేగేట్ వద్ద నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆమె చెప్పింది. దీంతో టూ టౌన్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆమెను పోలీసులు జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతోంది. మరోవైపు ఆమె కాలేజీ ప్రిన్సిపాల్ సాయిబాబాకు కూడా ఫోన్ చేసి, మెసేజ్‌లు పెట్టడంతో వారు కూడా కాకినాడ జీజీహెచ్‌కు చేరుకున్నారు. లక్ష్మి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీశారు. కేవలం స్నేహితురాళ్లు మాట్లాడడం లేదనే కారణంగానే ఆమె మనస్తాపం చెందినట్టు వారు తెలిపారు.
 
 దీనిపై టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా లక్ష్మి ఆత్మహత్య చేసుకుంటున్నానని నేరుగా ఎస్పీ రవిప్రకాష్‌కు ఫోన్ చేయడంతో కాకినాడలో పోలీసులు హైరానా పడ్డారు. ఎట్టకేలకు ఆమె ఎక్కడ ఉందో తెలియడం, ఆమె పరిస్థితి సక్రమంగానే ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. క్రైం సీఐ అల్లు సత్యనారాయణ, సర్పవరం ఇన్‌స్పెక్టర్ రత్నరాజు, ఎస్సై సురేష్ చావా తదితరులు జీజీహెచ్‌కు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. విషయం తెలుసుకున్న ఆమె స్నేహితులు, సాటి విద్యార్థులు ఆస్పత్రికి చేరుకుని ఆమెను పరామర్శించారు.
 

మరిన్ని వార్తలు