పెళ్లైన నాలుగు నెలలకే...

14 Aug, 2019 10:19 IST|Sakshi

నిండిన నూరేళ్లు...

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

కళ్లికోటలో విషాదం   

జీవితంపై కోటి ఆశలతో కొత్త కాంతులతో నాలుగు నెలల కిందటే ఆమె అత్తవారింట అడుగు పెట్టింది. కన్నవారు కూడా మేనరిక వివాహం కావడంతో తమ బిడ్డకు కొండంత భరోసా ఉంటుందని ఆశ పడ్డారు. ఇటు కన్నవారు...అటు అత్తవారు అంతా ఒకే కుటుంబ సభ్యులు కావడంతో ఆమె తన జీవితం ఇక పూల పాన్పే అనుకొంది. ఇంతలోనే ఏమైందో...అత్తవారింట అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో ఇటు కన్నవారు...అటు అత్తవారింట విషాదం నెలకొంది. మృతదేహానికి అంత్యక్రియలు ఏర్పాట్లు జరిగే సమయానికి శ్మశానవాటిక వద్దకు వచ్చిన పోలీసులు దాన్ని నిలుపు చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆ వివాహిత మృతి వెనుక ఏమైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే... 

కొమరాడ: మండలంలోని విక్రంపురం పంచాయతీ కొత్తమార్కొండపుట్టి గ్రామానికి చెందిన మేలాపు త్రినాధ, మధు దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో పెద్ద కుమార్తె మేలాపు సౌజన్య(20)కు మధుకుమేనల్లుడైన కళ్లికోట గ్రామానికి చెందిన మిరియాల అప్పలనాయుడు కుమారుడు హరీష్‌తో ఈ ఏడాది ఏప్రిల్‌ 1న వివాహం జరిపించారు. అనంతరం సౌజన్య తల్లిదండ్రులు ఉపాధి కోసం విజయవాడ వెళ్లారు. సౌజన్య కూడా వివాహ అనంతరం ఆషాడం కోసం కన్నవారింటికి వెళ్లి ఈ నెల ఏడో తేదీనే కళ్లికోటలోని అత్తవారింటికి వచ్చింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం సౌజన్య అత్తవారింటి వారు అంతా పొలం పనులకు వెళ్లిపోగా ఇంట్లోనే సౌజన్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అత్తవారింటి వారు పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చి చూడగా సౌజన్య  మంచంపై పడి ఉండడంతో ఒక్కసారిగా గొల్లుమన్నారు.108కి ఫోన్‌ చేయగా ఫలితం లేకపోవడంతో పార్వతీపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు సౌజన్యను పరీక్షించి మృతి చెందినట్టు వెల్లడించారు. దీంతో ఏం జరిగిందోనంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

పోలీసుల అనుమానంతో...
సోమవారం సాయంత్రం మృతి చెందిన సౌజన్య మృతదేహానికి మంగళవారం ఉద యం అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామంలోని శ్మశానవాటికి వద్దకు తీసుకువెళ్లగా సీఐ అరంగి దశరధ తన బృందంతో వచ్చి నిలుపు చేయించారు. ఇదే సమయంలో ఉప తహసీల్దార్‌ సూర్యనారాయణ నేతృత్వంలో కూడా ఓ బృందం శ్మశాన వాటికి వద్దకు చేరుకొంది. సౌజన్య మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొమరాడ ఇన్‌చార్జి ఎస్‌ఐ లోవరాజు వద్ద సాక్షి ప్రస్తావించగా తమకు అందిన సమాచారంతోనే శ్మశాన వాటికి వద్దకు చేరుకొని అంత్యక్రియలు నిలుపు చేశామని, పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉందని చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా