అతివలకు సీఎం వైఎస్‌ జగన్‌ అభయం

11 Dec, 2019 11:11 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

21 రోజుల్లో అమలు చారిత్రాత్మక బిల్లుకు రూపకల్పన  

సీఎం నిర్ణయంపై ఎమ్మెల్యేల హర్షం 

సాక్షి, విజయనగరం: పసికందు నుంచి పండు ముసలమ్మ వరకు.. ఎక్కడో అక్కడ.. నిత్యం అఘాయిత్యాలకు బలవుతున్నారు. హత్యాచారాలతో ఎందరో స్త్రీమూర్తులు నేల రాలిపోతున్నారు. లైంగిక దాడులతో కీచక మూకలు చెలరేగిపోతున్నారు. చట్టాల్లో లొసుగుల్ని ఉపయోగించుకుంటున్నారు.. సత్వర న్యాయం జరగక.. బాధితులు నీరుగారిపోతుంటే.. నేరస్తులు మరింత పేట్రేగిపోతున్నారు. తెలంగాణాలో దిశ విషాదం యావద్దేశాన్ని కదిలించింది. నిందితులకు సత్వర శిక్ష పడాలన్న డిమాండ్‌ ఊపందుకుంటోంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. మృగాల గుండెల్లో వణుకు పుట్టించేందుకు కఠిన చట్టానికి రూపకల్పన చేశారు.

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఈ బిల్లుపై చర్చ జరిపి, ప్రతిపక్షం సలహాలు, సూచనలను ఆహ్వానించింది. శాసనసభలో బుధవారం బిల్లును ప్రవేశపెట్టనుంది. మహిళపై నేరాలకు పాల్పడే వారికి విధించే శిక్షల గురించి భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 354లో ఇప్పటికే ఎ,బి,సి,డి ఉండగా కొత్తగా ‘ఇ’ని చేర్చనున్నారు. దీని ప్రకారం మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడిన వారిని 21 రోజుల్లో చట్ట ప్రకారం ఉరి తీసేందుకు అవకాశం కలుగుతుంది. కేసు విచారణకు ప్రతిజిల్లాలోనూ ప్రత్యేక కోర్టులు ఏర్పాటవుతాయి. అతివల రక్షణకు అద్భుతమైన చట్టానికి రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అక్షరాలా ఇది చారిత్రాత్మక చట్టమని జిల్లాలోని వైఎస్సార్‌ సీపీ శాసనసభ్యుల అభిప్రాయపడ్డారు.

మహిళల తరపున ధన్యవాదాలు
మహిళలపై అరాచకత్వానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మహిళా బిల్లును ప్రవేశపెడుతున్నారు. ఆడపిల్లల తండ్రిగా, రాష్ట్ర మహిళలకు జీవితాంతం గుర్తుండిపోయే చట్టాన్ని రూపొందిస్తున్నారు. ఆడపిల్లలపై జరిగే ఘోరాలను దృష్టిలో పెట్టుకొని దోషులు తప్పించుకునే వెసులుబాటు లేకుండా ఉండేలా తయారు చేస్తున్నారు. అది కూడా సరైన సాక్ష్యాలతో 3వారాలలో కఠిన శిక్ష పడేలా ఉంటుంది. మంత్రిగా ముఖ్యమంత్రికి మహిళల తరపున ధన్యవాదాలు.
– పాముల పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి

సాహసోపేతమైన నిర్ణయం
మహిళల మాన, ప్రాణాల రక్షణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాహసోపేతమైన చట్టం రూపొందిస్తుండటాన్ని స్వాగతిస్తున్నాం. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై నేరం రుజువైన 21 రోజుల్లో శిక్ష పడేలా చట్టాన్ని తీసుకురావడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే.. ప్రతి పక్షాలు ఉల్లిపాయల లొల్లి చేయడం వారికి మహిళలపై ఉన్న గౌరవం ఏమిటో తెలుస్తోంది. తెలుగుదేశం తీరు చూసి రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ఆలోచన ప్రజా హితం కోసమే. – అలజంగి జోగారావు, ఎమ్మెల్యే, పార్వతీపురం

చారిత్రాత్మకం
దారుణ నేరాలు చేసే వారికి సరైన శిక్షలు పడని వ్యవస్థలో..ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడే మృగాలకు కఠినమైన శిక్షలు పడేలా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. చిన్నారులు, మహిళలు బలవుతున్నా ప్రభుత్వాలు నామమాత్రంగానే స్పందిస్తున్న తరుణంలో చట్టాలున్నా, అమల్లో జాప్యం వల్ల బాధితులకు న్యాయం జరగటం లేదు. నిర్భయ కేసులో దోషులు నేటికీ బతికే ఉన్నారు. దిశ కేసుతో దేశ ప్రజలంతా విరక్తి చెందారు. ముఖ్యమంత్రి తనను నమ్మిన ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం అభినందనీయం, స్పష్టమైన ఆధారాలుంటే.. ఆరు వారాల్లో కఠిన శిక్ష అమలు చేసే చట్టానికి ఓటేస్తున్నందుకు గర్వపడుతున్నాను.  
– కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే, శృంగవరపుకోట

వీరశివాజీలా నిలబడ్డారు
భారతదేశంలో మహిళలకు అండగా నాడు వీర శివాజీ నిలబడ్డారు. ఇప్పుడా స్థానంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారు. భవిష్యత్‌లో ఏ మహిళకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో పగడ్బందీగా బిల్లు రూపొందిస్తున్నారు. బిల్లు రూపకల్పనలో భాగంగా ఇప్పటికే న్యాయ నిపుణులతో సైతం ముఖ్యమంత్రి సమాలోచనలు చేశారు. మహిళాబిల్లు రాకూడదనే ఉద్దేశంతో టీడీపీ నేతలు శాసన సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్ర మహిళలకు అండగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిలుస్తున్నాయి. – పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు

సీఎం నిర్ణయం అద్భుతం
మహిళల రక్షణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయం అద్భుతం. అత్యాచారాలు, హత్యలకు పాల్పడేవారికి ఉరిశిక్ష వేయడమనే ప్రతిపాదన ఎంతో సముచితం. మద్యం తాగేవారే ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఆదాయం ఎక్కువ వస్తున్నా దీనిని పక్కన పెట్టేందుకు నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. ముఖ్యమంత్రి గారి ఆలోచనకు మేం కట్టుబడి ఉన్నాం. ఆయన ఆలోచనను స్వాగతిస్తున్నాం. – శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఎమ్మెల్యే, బొబ్బిలి

రాద్ధాంతం చేస్తున్న టీడీపీ
శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లు విషయంలో ప్రతిపక్ష టీడీపీ అర్థం లేని రాద్ధాంతం చేస్తోంది. బిల్లుపై చర్చలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలు లేనిపోని అపోహలతో కాలయాపన చేస్తున్నారు. శాసనసభలో రభస సృష్టిస్తున్నారు. ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నారు. బిల్లు చట్టంగా రూపొందితే రాష్ట్రంలోని మహిళలకు సంపూర్ణ భద్రత లభిస్తుంది. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే వారికి ఈ చట్టం సింహస్వప్నంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చట్టం అమలుతో లైంగిక దాడులకు పాల్పడేందుకు వెనకంజ వేస్తారని నిస్సందేహంగా చెప్పవచ్చు. – బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్యే, నెల్లిమర్ల

మహిళలకు భరోసా
గతంలో మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా భయం కలిగేది. ఇప్పుడు సరికొత్త చట్టం తెచ్చేందుకు సీఎం భరోసా ఇవ్వడంతో వారికి అండ దొరికింది. మహిళలకు తానున్నానంటూ ముఖ్యమంత్రి జగన్‌ భరోసా ఇచ్చారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గొప్ప చట్టం రూపకల్పనకు హామీ ఇచ్చారు. ఆయన నిర్ణయంతో యావత్‌ మహిళాలోకం ఆనందంలో ఉంది. – బొత్స అప్పలనర్సయ్య, ఎమ్మెల్యే, గజపతిగరం

మరిన్ని వార్తలు