అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య

12 Feb, 2014 02:08 IST|Sakshi

యల్లనూరు, న్యూస్‌లైన్: అప్పుల బాధ తాళలేక యల్లనూరు మండలం గడ్డంవారిపల్లెకు చెందిన మహిళా రైతు సావిత్రి(44) ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గడ్డంవారిపల్లెకు చెందిన రైతు కేశవరెడ్డికి 15 ఎకరాల పొలం ఉంది. ఐదెకరాల్లో 500 చీనీ చెట్లు పెట్టారు. మరో 10 ఎకరాల్లో వేరుశనగ సాగుచేసేవారు. చీనీ చెట్ల కోసం ఐదు బోర్లు వేయగా అరకొర నీరు పడింది. పెట్టుబడులు, బోర్ల కోసం చేసిన అప్పు రూ. 8 లక్షలకు చేరింది.
 
 ఐదేళ్లుగా పంటలు సరిగా పండకపోవడంతో అప్పు తీర్చే మార్గం కన్పించక కేశవరెడ్డి, భార్య సావిత్రి వద్ద మదనపడేవాడు. భర్త మనోవేదనను చూసి మనస్తాపం చెందిన సావిత్రి సోమవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తుండగా మంగళవారం ఉదయం మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగస్వామి తెలిపారు.
 

మరిన్ని వార్తలు