మహిళా సాధికారత సాధించుకుందాం..

30 Mar, 2019 11:08 IST|Sakshi

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఒకప్పుడు వైఎస్సార్‌ మహిళా సాధికారత కోసం కృషి చేశారని, ఇప్పుడు జగన్‌ అండగా మనమందరం మళ్లీ ఆ సాధికారతను సాధించుకుందామని వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలో పార్టీ కార్యాలయంలో మహిళలతో ఆత్మీయ సమావేశం మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎంవీ పద్మావతి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ మహిళా బూత్‌ కమిటీ సభ్యులు 5వేల మందితో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గురుగుబెల్లి లోకనాధం చంద్రబాబు, ఎమ్మెల్యే వైఫల్యాలను మహిళలకు వివరించారు.

జగన్‌ చేపట్టబోయే కార్యక్రమాలను తెలిపారు. అనంతరం ధర్మాన మాట్లాడుతూ చంద్రబాబు మాఫీమాయలపై దుమ్మెత్తిపోశారు. పసుపు కుంకుమ పేరుతో జరుగుతున్న అన్యాయాలను వివరించారు. ప్లాన్‌ ప్రకారం మోసగించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని తెలిపారు. నిత్యావసరాలు పెరిగి అక్కచెల్లెళ్లు ఇబ్బందులు పడుతున్నారని, ప్రగతి కంటే ప్రచారమే ఎక్కువగా ఉందని చురకలు అంటించారు. ఎన్నికల్లో గెలవడానికి అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. కేంద్రం ఇచ్చిన సంస్థల్లో ఒక్కటి కూడా శ్రీకాకుళంలో ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు.  


అనంతరం పార్టీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ మాట్లాడుతూ చంద్రబాబునాయుడికి మహిళలంటే చిన్నచూపు అన్నాడు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం జగన్‌ మహత్తర పథకాలు రూపొందించారని వివరించారు. తమ పిల్లలకు బడికి పంపించే ప్రతి తల్లి ఖాతాలో నేరుగా ఏడాదికి రూ.15వేలు ఇస్తానన్న జగన్‌ హామీ మహిళల్లో ఎంతో ఉత్తేజానిచ్చిందన్నారు. మద్యపాన నిషేధం ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతుందన్నారు.  అనంతరం ఎంవీ పద్మావతి మాట్లాడుతూ మహిళలు వ్యక్తులు కాదు సమాజాన్ని అభివృద్ధి వైపుగా నడిపించే శక్తులన్నారు.
 

2014 ఎన్నికల్లో అధికారం చేపట్టిన ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని గుర్తు చేశారు. అన్ని సంక్షేమ పథకాల్లోనూ జన్మభూమి కమిటీలు దండుకున్నాయని ఆరోపించారు. తర్వాత ధర్మాన సుశ్రీ మాట్లాడుతూ ఓటు అనే ఆయుధాన్ని అమ్ముకుంటారో అభివృద్ధి చేసే నాయుకుడుకి పట్టం కట్టేందుకు వినియోగిస్తారో మీరే నిర్ణయించుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాలు చల్లా అలివేలు, మూకళ్ల సుగుణ, అంబటి అంబిక, టి.కామేశ్వరి, పి.సుగుణారెడ్డి, కుందేటి ఉమామహేశ్వరి, గుంట జ్వోతి, చల్లా మంజుల, ఎస్‌.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 
మహిళల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న ధర్మాన ప్రసాదరావు
 

మరిన్ని వార్తలు