పరిమళించిన మానవత్వం

14 Jun, 2019 08:50 IST|Sakshi
బస్సులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రాములమ్మ

సాక్షి, పాచిపెంట(విజయనగరం) : మానవ సేవే మాధవ సేవగా భావించారు. అందరూ సహకరించి ఓ గర్భిణికి పురుడుపోశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండడంతో సంతోషించిన ఘటన సాలూరులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. సాలూరు మండలంలోని పట్టుచెన్నేరు పంచాయతీ కోమటివలస గ్రామానికి చెందిన కొర్ర రాములమ్మ నాలుగు నెలల గర్భిణిగా ఉన్న సమయంలో భర్త, కుటుంబంతో కలిసి పనుల కోసం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు వలస వెళ్లిపోయారు. రాములమ్మకు ప్రసవ తేదీ దగ్గర పడడంతో బుధవారం స్వగ్రామానికి బయల్దేరారు.

ఈ క్రమంలో విశాఖపట్నంలో దిగి సాలూరు వస్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కారు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో బస్సు రామభద్రపురానికి చేరుకునే సరికి రాములమ్మకు నొప్పులు అధికమయ్యాయి. బిడ్డ ప్రసవమయ్యే పరిస్థితి రావడంతో వెంటనే రాములమ్మ భర్త నాగేశు కోమటివలస ఏఎన్‌ఎం సంగీతకు ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించారు. బస్సును ఆపకుండా సాలూరు వచ్చేయాలని, సాలూరులో సిద్ధంగా ఉంటానని తెలి పింది. డ్రైవర్‌కు సైతం బస్సును సాలూరు తీసుకరావాలని, మధ్యలో నిలిపివేయవద్దని ఏఎన్‌ఎం విన్నవించింది.

మానవత్వం చాటుకున్న ప్రయాణికులు, బస్సు డ్రైవర్, కండక్టర్‌ అందరి సహకారంతో రాములమ్మను సాలూరుకు  తీసుకొచ్చారు. అప్పటికే బిడ్డ సగం బయటకు వచ్చేసింది. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయ సెంటర్‌ వద్ద ఏఎన్‌ఎం బస్సులోకి ఎక్కి గర్భిణి పరిస్థితిని గుర్తించింది. బిడ్డ బయటకు రావడం, పేగులు కోయడం వల్ల తల్లికి ప్రమాదమని భావించింది. అంబులెన్స్‌కు ఫోన్‌ చేసినా రాలేదు. వెంటనే ఏఎన్‌ఎం స్థానిక సీహెచ్‌సీ స్టాఫ్‌ నర్స్‌కు ఫోన్‌చేసి ఇద్దరూ కలిసి అదే బస్సులో ఆర్టీసీ కాంప్లెక్స్‌ వెళ్లి అక్కడ బస్సులోనే రాములమ్మకు పురుడుపోశారు. రెండో కాన్పులో పండంటి మగబిడ్డకు రాములమ్మ జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను అర్ధరాత్రి సాలూరు సీహెచ్‌సీకి ఆటోలో  తరలించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు