మహమ్మారిపై సమరం!

31 May, 2016 00:18 IST|Sakshi
మహమ్మారిపై సమరం!

శ్రీకాకుళం సిటీ : మహిళలను వణికిస్తున్న కేన్సర్ వ్యాధి మరింత ప్రబలకుండా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. జిల్లా వ్యాప్తంగా 35 ఏళ్లు దాటిన మహిళల్లో కేన్సర్ లక్షణాలను గుర్తించేందుకు ఇంటింట సర్వేకు శ్రీకారం చుట్టారు. ‘మహిళా మాస్టార్ హెల్త్ చెకప్’ పేరుతో బ్రెస్ట్, సర్వేకల్ కేన్సర్‌లతో పాటు మధుమేహం, రక్తపోటు (హైపర్‌టెన్షన్), గర్భాశయ కేన్సర్‌లతో బాధపడుతున్న వారి ఆరోగ్యపరిస్థితులపై సర్వే చేపట్టేందుకు నిశ్చయించారు. జూన్ ఒకటో తేదీ నుంచి క్షేత్రస్థాయిలో కార్యరూపంలోనికి ఈ ప్రక్రియను తీసుకురానున్నారు.

ప్రాథమిక  లక్షణాలను ముందు గుర్తించకపోవడంతో వ్యాధి తీవ్రమై మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని గుర్తించి..మెరుగైన వైద్యం అందించడం ద్వారా నిరోధించాలని అధికారులు భావిస్తున్నారు.
 
జిల్లాలో పరిస్థితి ఇలా..
జిల్లాలో 80 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 478 ఉపకేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నారుు. వీటి పరిధిలో విధులు నిర్వహించే ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలే క్రియాశీలకంగా కేన్సర్‌పై సర్వేను నిర్వహించనున్నారు. జిల్లాలో వైద్యాధికారులకు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలకు ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శిక్షణను సైతం ఇటీవల పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 35 ఏళ్ల వయసు దాటిన మహిళలు సుమారు 40 శాతం వరకు ఉన్నట్లు గుర్తించారు. వారిలో ఎంతమంది ఈ తరహా వ్యాధులతో బాధపడుతున్నారో సర్వేలో తేటతెల్లం కానుంది. వ్యాధిగ్రస్తులకు ఎంపిక చేసిన సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో గైనికాధికారుల పర్యవేక్షణలో వైద్యసేవలు అందించనున్నారు.
 
జిల్లాలో నాలుగు రిఫరల్ సెంటర్లు
మహిళల్లో వచ్చే కేన్సర్ వ్యాధిని నిర్ధారించేందుకు పాలకొండ, టెక్కలి ఏరియా ఆస్పత్రులతో పాటు రాజాం, పలాస సీహెచ్‌సీలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. మరీ అత్యవసర పరిస్థితుల్లో శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో ఈ సేవలను కూడా పొందేందుకు అవకాశం కల్పించింది. మహిళలతో పాటు పురుషులల్లో కూడా కనిపించే నోటి కేన్సర్‌ను గుర్తించి చికిత్స అందించేందుకునిర్ణయించింది.

ప్రధానంగా గుట్కా లు, పొగాకు ఉత్పత్తులు తీసుకొనే వారిలో నోటి కేన్సర్ లక్షణాలు క నిపిస్తుంటాయి. ఈ తర హా బాధితులను గుర్తించి వైద్యసేవలు అందించాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం నిర్వహణకు ఏఎన్‌ఎంలకు గ్లౌజ్‌లు, ఆస్పత్రికి వచ్చే మహిళా రోగులను పరీక్షించేందుకు బెడ్‌తో పాటు మరిన్ని సదుపాయాలను కల్పించనుంది.

మరిన్ని వార్తలు