అపూర్వ ‘స్పందన’

30 Jul, 2019 03:48 IST|Sakshi
సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో అర్జీదారులు

స్పందన కార్యక్రమానికి పోటెత్తిన దరఖాస్తుదారులు 

భారీగా తరలివచ్చిన మహిళలు 

కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం చూపుతున్న అధికారులు

టీడీపీ ప్రభుత్వంలో విసిగివేసారిన ప్రజల్లో చిగురిస్తున్న ఆశలు

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘స్పందన’కు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పోటెత్తారు. ప్రధానంగా ఇళ్లు, రేషన్‌ కార్డులు, పింఛన్లు కావాలని ప్రజలు దరఖాస్తులు అందించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లో  1125 రాగా, విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు 4,852 అర్జీలు రాగా 3,235 సమస్యలను పరిష్కరించారు. విశాఖ కలెక్టరేట్‌లో 1062 దరఖాస్తులు వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 6 వేల దరఖాస్తులొచ్చాయి.  రంపచోడవరం ఏజెన్సీలో గిరిజనులు భారీగా తరలివచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజల ఫిర్యాదులపై స్వయంగా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. కృష్ణా జిల్లా కైకలూరు మార్కెట్‌ యార్డులో ‘స్పందన’కు 4,165 అర్జీలొచ్చాయి. ఇళ్ల స్థలాల కోసం ఏకంగా 3,111 మంది దరఖాస్తు చేశారు. గుంటూరు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’కు 1627 ఫిర్యాదులొచ్చాయి. ఒంగోలులోని జిల్లా కంట్రోలు రూములో నిర్వహించిన ‘స్పందన’కు 499 అర్జీలు అందాయి. నెల్లూరు కలెక్టరేట్‌లో కార్యక్రమానికి 10 మందికి పైగా అంధులు రావాడంతో కలెక్టర్‌ వెంటనే స్పందించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వైఎస్సార్‌ జిల్లా కలెక్టరేట్‌కు నాలుగు వేల మందికి పైగా ప్రజలు తరలివచ్చి సమస్యలపై వినతిపత్రాలిచ్చారు. కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 17,116 దరఖాస్తులు రాగా 12,064 పరిష్కరించారు. చిత్తూరు జిల్లాలో భూమి సమస్యలపైఎక్కువ దరఖాస్తురాగా, అనంతలో 2,023 అర్జీలు అందాయి. 

చెల్లెల్ని చేరదీస్తే..  వీధినపడేసింది..
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పసుపులేటి పార్వతి సంగీత కళాకారిణి.. భర్త దూరమయ్యాడు. వయసు మళ్లాక నాటకాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో ఇడ్లీ, దోసెలు అమ్ముకుంటూ జీవిస్తోంది. తన చెల్లెలు బండారు పాప, ఆమె ఇద్దరు కుమారులను చేరదీసి తన ఇంట్లోనే ఉంచుకుంది. తన చెల్లెలి రెండో కుమారుడు కిశోర్‌ను సీఏ కూడా చదివించింది. పార్వతికి ఆరోగ్యం బాగోకపోవడంతో తన తదనంతరం ఇల్లు తన చెల్లెలు పెద్ద కుమారుడైన బండారు సురేశ్‌కు దక్కాలని వీలునామా రాసింది. వయోభారంతో ఇడ్లీ, దోసెలు అమ్మే శక్తి లేదని  తన చెల్లెలికి చెప్పినప్పట్నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. భౌతిక హింసకు పాల్పడటంతోపాటు పిచ్చెక్కిందంటూ చెల్లెలు ఇంట్లోంచి గెంటేసింది. దీంతో పార్వతి సోమవారం ‘స్పందన’లో భాగంగా ఆర్డీవోను కలిసి తనకష్టాలు చెప్పుకుంది. 

మరిన్ని వార్తలు