వందనాలమ్మా..

25 Apr, 2020 12:55 IST|Sakshi
సేవలకు సెల్యూట్‌.. బందరులో ఒకరికొకరు నమస్కారం చేసుకుంటున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికురాలు

మహమ్మారిపై అతివల అలుపెరుగని పోరు

ఐఏఎస్‌ల నుంచి ఆశా కార్యకర్తల వరకూ..

క్షేత్రస్థాయిలో స్ఫూర్తిదాయక సేవలు

వైరస్‌ను పూర్తి స్థాయిలో కట్టడి చేసే వరకు పోరాటం సాగిస్తామని ప్రతిన  

సాక్షి, అమరావతిబ్యూరో: కరోనాపై పోరులో భాగంగా ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో కోట్లాది మంది ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ పోలీసులు, వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ముందుండి మహమ్మారిపై పోరాటం కొనసాగిస్తున్నారు. వీరిలో కొందరు మహిళామణులు కూడా అలుపెరగని సేవలు అందిస్తూ స్ఫూర్తిమంతంగా నిలుస్తున్నారు. జిల్లాలో ఐఏఎస్‌లు మొదలుకొని, పోలీసులు, వైద్యులు, ఆశావర్కర్లు, పారిశుద్ధ్య సిబ్బంది వరకు ఇందులో భాగస్వాములవుతున్నారు. కొందరు ఊరూరా తిరిగి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తుంటే.. మరికొందరు రోడ్లపైనే ఎండను లెక్క చేయక గస్తీ కాస్తూ వైరస్‌ కట్టడికి కృషిచేస్తున్నారు. 

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కె. మాధవీలత నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. నిత్యావసరాలు, కాయగూరల పంపిణీ నుంచి మొదలుకొంటే అధికారులతో సమీక్షల వరకు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వెంటవెంటనే ఇబ్బందులను పరిష్కరిస్తున్నారు.
విజయవాడ నగర పాలక సంస్థ కోవిడ్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఇన్‌చార్జ్‌ సీఎంహెచ్‌ఓ డాక్టర్‌ షాలినీ దేవి కోవిడ్‌–19 కట్టడికి నిత్యం క్షేత్రస్థాయికి పోతున్నారు. క్వారంటైన్, పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శానిటైజేషన్, తదితర పనులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
విజయవాడ జిల్లా ఆస్పత్రి అనస్థీషియా విభాగాధిపతి, కోవిడ్‌ ఆస్పత్రి ఐసీయూ విభాగ ఇన్‌చార్జిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ సూర్యశ్రీ కోవిడ్‌–19ని ఎదుర్కొనేందుకు ప్రణాళికతో ఉన్నారు. జిల్లాలో క్రిటికల్‌ స్టేజ్‌లో వస్తున్న కేసులు రాగా, వారికి మెరుగైన్‌ చికిత్స అందిస్తూ వారి నుంచి మరొకరికి సోకకుండా కట్టడి చేస్తున్నారు. ఐసీయూలో క్వారంటైన్‌లో ఉన్న వారిని పరిశీలించడం, ఐసోలేషన్‌ వార్డులను పర్యవేక్షించడం లాంటి పనులు నిర్వహిస్తున్నారు. 

లాక్‌డౌన్‌ విధుల్లో పురుషులతో సమానంగా మహిళా పోలీసులు తమ విధులను సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. పలువురు మహిళా ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు వాహనాలను నియంత్రిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వెళుతూ గర్భిణులు, చిన్నారులకు అండగా నిలుస్తున్నారు. మారుమూల గ్రామాలకు వెళుతూ సరుకులు అందజేస్తున్నారు.  
ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు వైరస్‌ సోకిన వారి ఇళ్ల పరిసరాల్లో సర్వే చేపడుతున్నారు. విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లొచ్చిన వారితోపాటు, కరోనా లక్షణాలున్న వారిని గుర్తించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్వారెంటైన్‌లో ఉన్న వారిని సైతం ఎప్పటికప్పుడు పరిశీలించి పరిస్థితిని వెల్లడించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.  
అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు కరోనా వేళ వారంతా ధైర్యంగా క్షేత్రస్థాయికి వచ్చి తమ వంతు సేవలు అందిస్తున్నారు. కొందరు మహిళా పారిశుద్ధ్య కార్మికులు స్వయంగా గ్రామాల్లో పిచికారీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
అనేక మంది మహిళా వైద్యురాళ్లు, పీజీ విద్యార్థినులు సైతం కరోనా పోరులో మేము సైతం అంటూ ధైర్యంగా విధులు నిర్వర్తిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

సవాలుగానే స్వీకరించా..
కరోనా నేపథ్యంలో ఇటు కుటుంబం.. అటు విధులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నా. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం ఒక విధంగా ఇబ్బందికరమే అయినా విధులను సవాలుగా స్వీకరించా. ఉన్నతాధికారులు ఇస్తున్న మద్దతుతో విజయవంతంగా పని చేస్తున్నా.  – పద్మిని, ఎస్‌ఐ, గవర్నర్‌పేట పీఎస్‌

జాగ్రత్తలుతీసుకుంటున్నాం
కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించే సమయంలో అన్నీ మమే చూసుకుంటున్నాం. వారికి మందులు ఇవ్వడం, మంచినీరు, ఆహారం అందించడం వంటివి చేస్తున్నాం. మేము వారి వద్దకు వెళ్లే సమయంలో ఏ మాత్రం చిన్నపొరపాటు జరిగినా మాకు వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. అయినప్పటికీ విధులు నిర్వహిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇంటికి కూడా వెళ్లడం లేదు.  – నవకుమారి, స్టాఫ్‌ నర్స్, కోవిడ్‌ హాస్పిటల్, విజయవాడ

మరిన్ని వార్తలు