రక్షక భటులం.. మాకు రక్షణేదీ?

13 Jan, 2020 02:59 IST|Sakshi
జాతీయ మహిళా కమిషన్‌ కో ఆర్డినేటర్‌కు వినతిపత్రం ఇస్తున్న మహిళా పోలీసులు, పోలీసు అధికారుల సంఘం నాయకుడు

‘అమరావతి’లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీసుల ఆవేదన

తమపై జరిగిన వేధింపులపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు 

26 రోజులుగా విధి నిర్వహణలో ఏనాడూ లాఠీ ఎత్తలేదు 

విధుల్లో ఉన్న మమ్మల్ని ఆందోళనకారులు నోటికొచ్చినట్లు దూషించారు 

పురుషులు అసభ్యకరంగా ప్రవర్తించారు.. ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటున్నారు  

కూర్చోవడానికి కూడా వీల్లేకుండా సిమెంట్‌ బెంచీలపై ఆయిల్,పేడ నీళ్లు, కారంపొడి చల్లారు

సాక్షి, గుంటూరు: అమరావతి ప్రాంతంలోని రైతులు, మహిళలపై పోలీసులు అకారణంగా దాడులు చేస్తున్నారంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు సాగిస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు వారు అడుతున్న కుట్రల బాగోతం బయటపడింది. విధి నిర్వహణలో గత 26 రోజుల్లో తాము ఏనాడూ లాఠీ ఎత్తలేదని పోలీసులు స్పష్టం చేశారు. అమరావతిలో విధుల్లో ఉన్న తమను మహిళలని కూడా చూడకుండా ఆందోళనకారులు నోటికొచ్చినట్లు దూషించారని మహిళా పోలీసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమపై జరిగే దాడులు, వేధింపులకు ఎవరు రక్షణగా నిలుస్తారని కన్నీరు పెట్టుకున్నారు. దాహం వేస్తే దుకాణాల్లో నీళ్లు కూడా అమ్మలేదని వాపోయారు. గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చిన జాతీయ మహిళా కమిషన్‌ సీనియర్‌ కో–ఆర్డినేటర్‌ కాంచన్‌ ఖత్తర్, మహిళా కమిషన్‌ కౌన్సిలర్‌ ప్రవీణ్‌సింగ్‌ను గుంటూరు రూరల్‌ పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు టి.మాణిక్యాలరావు, మహిళా పోలీసు సిబ్బంది ఆదివారం కలిశారు. అమరావతి ప్రాంతంలో రైతుల ముసుగులో కొందరు ఆందోళనకారులు, గ్రామస్థులు తమను వేధింపులకు గురిచేశారని ఫిర్యాదు చేశారు. 

కొందరు అసభ్యకరంగా ప్రవర్తించారు 
అమరావతి ప్రాంతంలో సెక్షన్‌ 144, 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉన్నందున నిబంధనల మేరకు నలుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడితే మాత్రమే వారిని పక్కకు వెళ్లమని నచ్చజెప్పేందుకు ప్రయత్నించామని మహిళా పోలీసులు జాతీయ మహిళా కమిషన్‌ సీనియర్‌ కో–ఆర్డినేటర్‌కు తెలియజేశారు. తాము ఏ రోజూ ఆందోళనకారుల ఇళ్లలోకి ప్రవేశించలేదన్నారు. ఆందోళనల పేరుతో మహిళలను ముందు పెట్టి కొందరు పురుషులు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. తమను దారుణంగా తిట్టారని, మనోవేదనకు గురిచేశారని ఫిర్యాదు చేశారు. కుటుంబాలను వదిలిపెట్టి రేయింబవళ్లు సేవ చేస్తున్న తమపై తప్పుడు సాగించడం ఏమిటని కన్నీటి పర్యంతమయ్యారు.  

తాగడానికి నీళ్లు కూడా అమ్మడం లేదు 
‘‘గత 26 రోజులుగా అమరావతి ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నాం. మేం ఏ రోజూ లాఠీ పట్టలేదు. లాఠీచార్జి చేయలేదు. అలాంటిది మహిళలపై లాఠీచార్జి చేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మహిళా పోలీస్‌ సిబ్బందిలో కొందరు గర్భవతులు, పెద్ద వయసు వారు, ఆరోగ్యం బాగాలేనివారు కూడా ఉన్నారు. వారు ఎక్కువసేపు నిలబడలేక ఎక్కడైనా కాసేపు కూర్చుందామని వెళితే.. అరుగులు, సిమెంట్‌ బెంచీలపై ఆయిల్, పేడ నీళ్లు, కారంపొడి చల్లారు. కూర్చోవడానికి కూడా వీల్లేకుండా చేస్తున్నారు. దాహం వేసి షాపుల్లో నీళ్ల బాటిల్‌ కొనుక్కోవడానికి వెళితే అక్కడ మంచినీళ్లు అమ్మడం లేదు. ఆడవారు, మగవారు మమ్మల్ని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. అయినా ఏనాడూ మేం సహనం కోల్పోలేదు’’ 
– వెంకటేశ్వరమ్మ, మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ 

17 ఏళ్ల సర్వీస్‌లో ఏ రోజూ ఈ మాటలు పడలేదు 
‘‘నేడు 17 ఏళ్ల క్రితం పోలీసు డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చాను. ఎన్నో ఆందోళనలు, నిరసనల్లో విధులు నిర్వహించాను. ఏ రోజూ ఆందోళనకారులు మమ్మల్ని దూషించడం, మాపై చేయి చేసుకోవడం జరుగలేదు. నా 17 ఏళ్ల సర్వీస్‌లో ఎన్నడూ లేని విధంగా రాజధాని ప్రాంతంలో ఆందోళనకారులు మహిళలమని కూడా చూడకుండా మాటల్లో చెప్పలేని విధంగా తిడుతున్నారు. ఆఖరికి మహిళా నిరసనకారులు కూడా మమ్మల్ని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు’’
– పద్మజ, మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌

వేయకూడని చోట చేతులు వేస్తున్నారు
‘‘మహిళలను ముందు పెట్టి, వెనుక పురుషులు ఉండి ఆందోళన చేస్తున్నారు. మహిళా నిరసనకారులను అడ్డుకునే సమయంలో వాళ్లు పక్కకు తప్పుకుంటున్నారు. వారి వెనకున్న పురుషులు మహిళా పోలీస్‌ సిబ్బందిని ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటున్నారు. వేయకూడని చోట చేతులు వేస్తున్నారు. నలుగురికి రక్షణగా నిలవాల్సిన మాకే రక్షణ లేకుండా పోతోంది. కొన్ని సందర్భాల్లో ఆందోళనకారుల నుంచి మమ్మల్ని మేం రక్షించుకోవాల్సి వస్తోంది’’ 
– శిరీష, మహిళా ఏఎస్సై

దాడికి దిగుతున్నారు
‘‘పోలీసులపైనే ఆందోళనకారులు దాడికి దిగుతున్నారు. వారు రాళ్లు విసిరడంతో నా తలకు గాయమైంది. కొట్టడం, గిచ్చడం, బరకడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. విధులకు హాజరయ్యే మహిళా పోలీస్‌ అధికారులు, సిబ్బందిని ఆడ, మగ తేడా లేకుండా నోటికి వచ్చినట్టు దూషిస్తున్నారు. తాగడానికి నీళ్లు కొనుక్కోవడానికి వెళితే దుకాణాల్లో నీళ్లు కూడా అమ్మడం లేదు’’ 
– శివకుమారి, మహిళా ఏఎస్సై 

>
మరిన్ని వార్తలు