మహిళలపై పోలీసుల దాష్టీకం

26 Feb, 2019 12:14 IST|Sakshi
చిత్తూరులో గాయత్రిదేవిని అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు

 చెవిరెడ్డి సతీమణి ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన

అక్రమ నిర్బంధంలో ఉన్న వారిని వదిలేయాలని డిమాండ్‌

శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళలపై దౌర్జన్యం

చీరలు లాగి, కాళ్లతో తన్ని దారుణం

సొమ్మసిల్లి పడిపోయిన ఆందోళనకారులు

న్యాయం కోరితే..అణచివేత దారుణం

చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్‌ రెడ్డి సతీమణి లక్ష్మి ఆవేదన

చిత్తూరు, సాక్షి: అక్రమ అరెస్టులను నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళల పట్ల పోలీసులు పైశాచికంగా ప్రవర్తించారు. జుట్టు లాగి, చీర కొంగు చింపి రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. దుర్భాషలాడారు. బూటు కాళ్లతో తన్నారు. ఇష్టం వచ్చినట్లు తోయడంతో కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. పాకాలలో అక్రమంగా అరెస్టు చేసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని విడుదల చేయాలని ఆయన సతీమణి లక్ష్మి ఆధ్వర్యంలో చిత్తూరులోని పాత ఎస్పీ కార్యాలయం ఎదుట వందల సంఖ్యలో మహిళలు సోమవారం ధర్నా చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు మండుటెండను లెక్క చేయకుండా నిరసన తెలియజేశారు. చెవిరెడ్డి లక్ష్మి మాట్లాడుతూ  చంద్రగిరి, ఎర్రావారిపాళ్యం, పాకాలలో టీడీపీ నాయకులు సర్వేలు నిర్వహించి 14వేల ఓట్లు తొలగించడానికి పన్నాగం పన్నారన్నారు. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అరెస్టు చేసి, కేసులు నమోదు చేసి హింసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి అండగా ఉన్న ఎమ్మెల్యే చెవిరెడ్డిని అక్రమంగా నిర్బంధించారన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

టీడీపీ నేతల డైరెక్షన్‌లోనే..
వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పోలీసుల దాడి ఆద్యంతం అధికార పార్టీ కనుసన్నల్లోనే జరిగింది. వెంటనే అరెస్టులు చేయాలని పోలీసులను ఫోన్లలో బెదిరించడం మొదలు పెట్టారు. వారి ధర్నాను భగ్నం చేయకుంటే మేం కూడా వచ్చి కూర్చుంటామని హెచ్చరించారు. దీంతో ఏఎస్పీ సుప్రజ రంగంలో దిగారు. ఆమె వచ్చీ రావడంతోనే ధర్నా చేస్తున్న మహిళలపై విరుచుకుపడ్డారు. వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు.

పోలీసుల పైశాచికం..
5 గంటల పాటు శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కార్యకర్తలను విడుదల చేస్తే వెంటనే ధర్నా విరమిస్తామని చెప్పినా వినకుండా కర్కశంగా ప్రవర్తించారు. జుట్టు లాగి, చీర కొంగు చింపి రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. కొంతమంది మహిళలను చిత్తూరు వన్‌టౌన్‌ సీఐ శ్రీధర్, డీఎస్పీ రామకృష్ణ దుర్భాషలాడారు. మహిళా కానిస్టేబుళ్లు చేయిచేసుకున్నారు. బూటు కాళ్లతో తన్నారు. ఇష్టం వచ్చినట్లు తోయడంతో పలువురు గాయపడ్డారు. శోభ అనే మహిళ సొమ్మసిల్లిపడిపోయింది. ఈడ్చుకుంటూ పోలీసు వ్యాన్లో పడేశారు. ఎమ్మెల్యే భార్య అని కూడా చూడకుండా చెవిరెడ్డి సతీమణి లక్ష్మిని ఏకవచనంతో సంబోధించారు. మహిళలతో పాటు చెవి రెడ్డి తనయులు మోహిత్‌ రెడ్డి, హర్షిత్‌ రెడ్డిలను కూడా అరెస్టు చేసి యాదమర్రికి తరలించారు. అనంతరం వదిలిపెట్టారు. మూడు వ్యాన్లలో మహిళలను తిరుచానూరు తదితర ప్రాం తాలకు తరలించారు.

రాయలసీమ రేంజ్‌ డీఐజీ ఉన్నా..
చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న çఘటనలపై విచారణ చేయాలని రాయలసీమ రేంజ్‌ డీఐజీ క్రాంతిరాణా టాటాను ఈసీ ఆదేశించింది. ఆయన సోమవారం చిత్తూరుకు వచ్చారు. ఆయన అక్కడే ఉన్నా మహిళలపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు.

కలెక్టర్‌పై ఈసీ సీరియస్‌?
చిన్నపాటి శాంతియుత ధర్నాకు కడప, అనంతపురం నుంచి బలగాలను ఎందుకు పిలిపించాల్సి వచ్చిందని కలెక్టర్‌ ప్రద్యుమ్నను ఎన్నికల కమిషన్‌ ప్రశ్నించింది. ఓట్ల తొలగింపు ఫాంలు ఎక్కువ నమోదవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని అక్షింతలు వేసింది. చంద్రగిరి, ఎర్రావారిపాళ్యం, పాకాల సంబంధి పూర్తి వివరణ ఇవ్వాలని కోరింది.

అక్రమ అరెస్టులతో ప్రజాభిమానాన్ని దూరం చేయలేరు
పోలీసులను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ నేతలు చేయిస్తున్న అక్రమ అరెస్టులతో ప్రజాభిమానాన్ని దూరం చేయలేరు. టీడీపీ ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారు. అరెస్టులకు నేను బెదరను. ఎంతకాడికైనా పోరాడుతా. నాకు అండగా ఉన్న ప్రజలను, పార్టీ శ్రేణులను కాపాడుకుంటా. కుటుంబ సభ్యులకు సమాచారం లేకుండా నన్ను అప్రజాస్వామికంగా అరెస్టు చేసి రాత్రంతా ఇతర రాష్ట్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా తిప్పిన పోలీసులపై చర్యలు తీసుకునే విధంగా పోరాడతా.       – చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, ఎమ్మెల్యే, చంద్రగిరి

పోలీసులా..అధికార పార్టీ కార్యకర్తలా..
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ప్రభుత్వంలో పోలీసులు పార్టీ కార్యకర్తల కన్నా రెట్టింపు ఉత్సాహంతో వ్యవహరిస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యేలను అక్రమ అరెస్టులు, కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధానికి గురైన ఎమ్మెల్యే చెవిరెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన నన్ను చిత్తూరు డీఎస్పీ అడ్డుకోవడమే కాక నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం.– నారాయణస్వామి, ఎమ్మెల్యే, జీడీనెల్లూరు

నీతిమాలిన చర్య
పోలీసుల అత్యుత్సాహంతో ప్రశాంత వాతావరణంలో ఉన్న సత్యవేడులో శాంతిభద్రతల సమస్య తలెత్తింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిని నిబంధనలకు విరుద్ధంగా నిర్బంధించడం అప్రజాస్వామికం. పైగా ఆయన్ను ఇతర రాష్ట్రాల్లో తిప్పడం అన్యాయం. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చే వైఎస్సార్‌ సీపీ శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకోవడం పోలీసుల నీతిమాలిన చర్యకు నిదర్శనం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాల్సిన పోలీసులు రెచ్చగొట్టే విధానాన్ని అవలంబించడం సరికాదు.– ఆదిమూలం,వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త, సత్యవేడు నియోజకవర్గం

మరిన్ని వార్తలు