రండి.. కూర్చోండి.. మేమున్నాం

23 Jul, 2019 11:27 IST|Sakshi
కావలి వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సీహెచ్‌ సౌమ్య

పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదుదారులకు ఆత్మీయ పలకరింపు

ప్రజలతో అధికారులు బాధ్యతగా నవ్వుతూ పలకరించాలన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

స్టేషన్లలో ఫిర్యాదుదారుల కోసం మహిళా రిసెప్షనిస్ట్‌లను ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ

సాక్షి, కావలి (నెల్లూరు): మార్పు సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. పాలనలో కింది స్థాయి అధికారులు కూడా ప్రజలకు బాధ్యాతాయుతంగా పని చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న ‘స్పందన’ను జిల్లా ఎస్పీ ఆదర్శంగా తీసుకున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు కావలి పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగడానికి పోలీస్‌ స్టేషన్‌లలో మహిళా కానిస్టేబుళ్లను రిసెప్షనిస్టులుగా నియమించారు. దీంతో ఫిర్యాదుదారులు, బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు వస్తే ఆత్మీయంగా పలకరించి వారి సమస్యను, బాధలను, కష్టాన్ని ఓపికగా వింటున్నారు, ఓదార్చుతున్నారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లే వారికి ప్రారంభంలోనే మనసు కాస్త ఊరట కలుగుతుండటంతో నూతన ఒరవడిని అమలు చేస్తున్న పోలీసుల వైఖరిని అభినందిస్తున్నారు.

పట్టణంలో ఉన్న వన్‌ టౌన్, టూ టౌన్, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లతో పాటు బిట్రగుంట పోలీస్‌ స్టేషన్‌లలో జీహెచ్‌ సౌమ్య, కె.రామసుబ్బమ్మ, జె.రజనీ, కె.అనూష తదితర మహిళా కానిస్టేబుళ్లు రిసెప్షనిస్ట్‌లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఫిర్యాదు దారులు, బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు రాగానే విధుల్లో ఉన్న వారు కస్సుబుస్సుమంటూ కసురుకుంటూ చీదరించుకొనేవారు. కాగితంపై రాసుకొని రాపో అంటూ విసుక్కొనేవారు. అయితే మహిళా రిసెప్షనిస్ట్‌లు మాత్రం రండి కూర్చోండి అంటూ పలకరిస్తున్న తీరు ఆకట్టుకుంటుంది. బాధితులు చెప్పే విషయాలు అన్నీ ఓపిగ్గా విని వారే కాగితంపై బాధితులు చెప్పే అంశాలన్నింటినీ నిదానంగా ఫిర్యాదు రూపంలో రాస్తున్నారు. దీనివల్ల ఫిర్యాదు దారునికి న్యాయం జరగడానికి అవకాశం ఏర్పడుతుంది.

ఫిర్యాదు ఇచ్చిన తర్వాత రశీదును అందచేస్తున్నారు. ఈ నూతన ప్రకియ వల్ల న్యాయం కోసం పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించే బాధితులు మారిన పరిస్థితులను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విధులు నిర్వర్తించే మహిళా రిసెప్షనిస్ట్‌లు ఎటూ కదలకుండా పోలీస్‌ స్టేషన్‌లోకి ప్రవేశించగానే ఉండే ప్రదేశంలో కూర్చొనే ఉంటున్నారు. కాగా రిసెప్షనిస్ట్‌ల వద్ద ఆయా స్టేషన్‌లలో విధులు నిర్వర్తించే ముదురు కానిస్టేబుళ్లు తిష్టవేసి, ఫోన్‌లలో మాట్లాడుకుంటూ ఉండటం, వచ్చిన బాధితుల వద్ద బడాయి మాటలు చెప్పుకొంటున్న తీరు మాత్రం వాతావరణాన్ని చెడకొడుతున్నట్లుగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. 

సమస్యలు వింటుంటే  బాధగా ఉంటుంది
పోలీస్‌ స్టేషన్‌కు ఏదో కష్టం వస్తేనే కదా వచ్చేది. బాధతో వచ్చిన వారితో నిదానంగా వారి బాధలు ఓపిగ్గా వినాలి. వారి బాధలు వింటూ పోలీస్‌ అధికారులకు అన్ని విషయాలు తెలియజేసి న్యాయం జరిగేలా చేస్తానని చెబుతాను. బాధలు వింటుంటే ఇలాగా కూడా జరుగుతుందా అని బాధగా ఉంటుంది.
– సీహెచ్‌ సౌమ్య, మహిళా రిసెప్షనిస్ట్, కావలి వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌

ఫలితాలు బాగున్నాయి
మహిళలు రిసెప్షనిస్ట్‌గా ఉండటం వల్ల ఫిర్యాదుదారులపై గౌరవంగా ఉంటారు. తొందరపాటుగా ప్రవర్తించరు. అలాగే మహిళలు వస్తే వారి సమస్యలు తెలుసుకోవడానికి ఇబ్బంది ఉండదు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారి వద్ద సమస్య తలెత్తితే పోలీస్‌ స్టేషన్‌లో ఉండే రైటర్‌ వచ్చి చూసుకొంటారు. అతనికి మించిన సమస్య వస్తే నేనే అక్కడకు చేరుకొంటాను. మహిళా కానిస్టేబుల్‌ను రిసెప్షనిస్ట్‌ గా నియమించడం వల్ల ఫలితాలు బాగున్నాయి.
– ఎం.రోశయ్య, సీఐ, కావలి వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌

మరిన్ని వార్తలు