పెళ్లింట.. కట్నం మంట

13 Mar, 2016 09:10 IST|Sakshi

నిలిచిపోయిన పెళ్లి
పెళ్లి చేసుకోవాల్సిందేనని..
యువతి మౌనపోరాటం
 
పెళ్లిళ్లకు ప్రత్యేక డాట్‌కామ్‌లొచ్చాయి. ప్రస్తుతం యువతీయువకులు వాటిపైనే ఆధారపడుతున్నారు. ఆ విధంగానే ఓ జంటను కలిపింది. ఇద్దరు మాట్లాడుకున్నారు. పెళ్లికి ఇరువురు కుటుంబాలను ఒప్పించారు. కట్నకానుకలు ఓకే అనుకున్నారు. నిశ్చితార్థం చేసుకున్నారు. కట్నం విషయంలో విభేదాలు వచ్చాయి.

అంతే అడ్డం తిరిగాడు. అతడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో యువతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫలితం లేదు.  శనివారం మౌన పోరాటానికి దిగిన సంఘటన రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట చోటుచేసుకుంది.
 
రెడ్డిగూడెం : కట్నం విషయంలో విభేదాలతో పెళ్లి చేసుకునేందుకు యువకుడు నిరాకరించడంతో బాధితురాలు శనివారం మౌనపోరాటానికి దిగింది. వివరాలు.. మండల పరిధిలోని అన్నేరావుపేటకు చెందిన నెల్లూరు విజయ్‌దీపు, గాజువాకకు చెందిన సామరోతు లక్ష్మీమానసకు మధ్య ఓ వెబ్‌సైట్ ద్వారా ఇద్దరు పరిచయమయ్యారు. పరిచయం వివాహం వరకు వెళ్లింది.
 
ఇరువురి తల్లిదండ్రులు, పెద్దలూ అంగీకరించారు. పెళ్లి తేదీ పెట్టుకున్నారు. కట్నకానుకల విషయంలో విభేదాలు రావడంతో వివాహం చేసుకునేందుకు యువకుడు నిరాకరించాడు. దీంతో ఆమె తనకు న్యాయం చేయాలంటూ యువకుడు ఉద్యోగం చేస్తున్న హైదరాబాద్‌లోనూ, అదే విధంగా యువకుడు బంధువులున్న ఖమ్మం పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
 
పోలీసులు కేసు నమోదు చేశారు. అయినప్పటికీ తనకు న్యాయం జరగకపోవడంతో శనివారం  ఉదయం 5.30 గంటలకు విజయ్‌దీప్ స్వగ్రామమైన అన్నేరావుపేటలోని అతని ఇంటి ముందు దీక్ష చేపట్టింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు యువతిని దీక్ష విరమింపజేసేందుకు ప్రయత్నించిన అంగీకరించలేదు. మైలవరం సీఐ వెంకట రమణ, రెడ్డిగూడెం ఎస్‌ఐ కె.రమేష్ ఆమెతో చర్చించారు. అయినా ఫలితం లేదు. యువతి దీక్ష కొనసాగిస్తోంది.

మరిన్ని వార్తలు