కృష్ణానదిలో దూకిన మహిళ

18 Aug, 2019 11:48 IST|Sakshi
రూతమ్మ, యుగంధర్‌ 

తేలిన మృతదేహం 

కనిపించని కుమారుడి ఆచూకీ 

కుటుంబ సమస్యలతో ఆత్మహత్య 

సాక్షి, కర్నూలు/శ్రీశైలం: కుటుంబ సమస్యలతో లింగాలగట్టుకు చెందిన మైలపల్లి రూతమ్మ (26) కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఆమె మృతదేహం కనిపించింది.  కుమారుడు యుగంధర్‌ (5)తో కలిసి ఆమె కృష్ణా నదిలో దూకి ఉండవచ్చని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు యుగంధర్‌ ఆచూకీ లభ్యం కాలేదు. శ్రీశైలం టూ టౌన్‌ ఎస్‌ఐ చిన్నపీరయ్య తెలిపిన మేరకు.. లింగాలగట్టు గ్రామానికి చెందిన రూతమ్మ.. ప్రకాశం జిల్లా దోర్నాల గ్రామానికి చెందిన మహేశ్వరరెడ్డిని కులాంతర వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొద్ది సంవత్సరాల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో రూతమ్మ లింగాలగట్టులోని ఆమె తల్లి మైలపల్లి చిన్నతల్లి, అన్న రాజుల వద్దకు వచ్చింది. తన ఇద్దరు కుమారులతో పాటు ఉంటూ చిన్న హోటల్‌ పెట్టుకుని జీవనం సాగిస్తోంది.

శుక్రవారం రాత్రి అన్న కొడుకు పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్న సమయంలో బంధువులను ఆహ్వానించే విషయంలో రూతమ్మకు ఆమె తల్లి, అన్నల మధ్య  వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో క్షణికావేశానికి గురైన రూతమ్మ చిన్నకుమారుడు యుగంధర్‌ను తీసుకొని వెళ్లింది. కోపంతో బంధువుల ఇంటికి వెళ్లి ఉంటుందని కుటుంబసభ్యులు భావించారు. అయితే శనివారం శ్రీశైలం బ్రిడ్జి అవతల భాగంలో ముళ్లచెట్లకు తగులుకుని రూతమ్మ మృతదేహం పైకి తేలింది. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం చేరవేశారు. ఎస్‌ఐ చిన్నపీరయ్య.. మృతదేహాన్ని శ్రీశైలం ప్రాజెక్ట్‌ ప్రభుత్వాసుపత్రికి శనివారం సాయంత్రం తరలించారు. యుగంధర్‌ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు