వర్మపై నిర్భయ కేసు నమోదు చేయాలి

3 Mar, 2018 06:57 IST|Sakshi

మహిళా సంఘాల డిమాండ్‌

ఒంగోలు టౌన్‌: మహిళలను అసభ్యకరంగా మాట్లాడుతూ ఫోర్న్‌ సినిమాలు తీసే రామ్‌గోపాల్‌వర్మపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఐద్వా జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు యూ.ఆదిలక్ష్మి మాట్లాడుతూ జీఎస్‌టీ సినిమాలో మహిళలను అసభ్యకరంగా చూపించారన్నారు.

ఐద్వా నాయకురాళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని చూస్తుంటే మహిళలపై ఆయనకు ఎలాంటి గౌరవం ఉందో అర్థమవుతోందన్నారు. రామ్‌గోపాల్‌వర్మను అరెస్టు చేసే వరకూ మహిళా సంఘాలు చేస్తున్న నిరాహారదీక్షల్లో మహిళా కమీషన్‌ చైర్‌పర్సన్‌ పాల్గొనాలని కోరారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.పద్మ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని కించపరిచే విధంగా ఫోర్న్‌ సినిమాలు ఉంటున్నాయని ధ్వజమెత్తారు. రామ్‌గోపాల్‌వర్మ తీసిన జీఎస్‌టీ సినిమా యువతను పెడద్రోవ పట్టించే విధంగా ఉందన్నారు. ఐద్వా నగర కార్యదర్శి కె.రమాదేవి అధ్యక్షతన జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నాయకురాళ్లు కల్పన, రాజేశ్వరి, గోవిందమ్మ, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భారతి, మంజుల, యూటీఎఫ్‌ మహిళా విభాగం జిల్లా నాయకురాలు ఉమామహేశ్వరి పాల్గొన్నారు.

సమావేశానికి హాజరైన మహిళా నేతలు

మరిన్ని వార్తలు