ఎక్కడి దుకాణాలు అక్కడే..

5 Jul, 2017 03:57 IST|Sakshi
ఎక్కడి దుకాణాలు అక్కడే..

విజయనగరం రూరల్‌: అంతా అనుకున్నట్టే జరిగింది. మద్యంపై వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు కాదంటూనే మద్యం అమ్మకాలు పెంచడానికే ప్రభుత్వం మొగ్గుచూపింది. దీంతో రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రహదారులుగా మారుస్తూ ప్రభుత్వం జీఓ ఎంఎస్‌ 28 మంగళవారం విడుదల చేసిం ది. చంద్రబాబు సర్కార్‌ తన జిమ్మిక్కులతో ఏకంగా సుప్రీంకోర్టు తీర్పునే అపహాస్యం చేసిందని పలువురు మండిపడుతున్నారు.

మార్గదర్శకాలకు చెక్‌
తుంగలో తొక్కింది. తమ పరిధిలో ఉన్న రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రహదారులకు డీనోట్‌ఫై చేస్తూ ప్రభుత్వం మంగళవారం జీఓ జారీ చేసింది. నూతన మద్యం విధానంలో భాగంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న దుకాణాలు, బార్లు 220 నుంచి 500 మీటర్ల దూరంలో చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈనెల ఒకటి నుంచి రహదారులకిరువైపులా ఉన్న దుకాణాలను తొలగించేశారు. దీంతో ఈ దుకాణాలను జనావాసాల మధ్య ఏర్పాటు చేయడానికి ప్రయత్నించగా, ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రహదారులుగా మార్చింది. అంతా అనుకున్న విధంగా జరగడంతో రాష్ట్ర రహదారుల పక్కనే మద్యం దుకాణాల ఏర్పాటుకు మార్గం సుమగమైంది.

జాతీయ రహదారులపై ఉన్న దుకాణాలే మార్పు..
జిల్లా వ్యాప్తంగా జూన్‌ 30 నాటికి 210 మద్యం దుకాణాల్లో 169 మద్యం దుకాణాలు, 27 బార్లలో 18 జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే ఉండేవి. వీటిలో 43 మద్యం దుకాణాలు, ఏడు బార్లు జాతీయ రహదారుల పక్కన.. రాష్ట్ర రహదారుల పక్కన 126 మద్యం దుకాణాలు, 11 బార్లు ఉన్నాయి. అయితే ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రకారం కేవలం జాతీయ రహదారుల పక్కన ఉన్న దుకాణాల మార్పే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జీఓలో కేవలం మున్సిపల్‌ కార్పొరేషన్, మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లోనే రాష్ట్ర రహదారులపై మద్యం దుకాణాలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. జిల్లాలో 90 శాతంపైగా మద్యం దుకాణాలు మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లోని గ్రామాల్లో ఉండడంతో 120 వరకు దుకాణాలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. మంగళవారం వరకు జిల్లా వ్యాప్తంగా 210 మద్యం దుకాణాలకు గాను ఎక్సైజ్‌ అధికారులు 108 దుకాణాలకు అనుమతులు ఇవ్వగా, విజయనగరం డివిజన్‌లో ఏడు బార్ల నిర్వహణకు అనుమతులు మంజూరు చేశారు.

>
మరిన్ని వార్తలు