ఆమే కీలకం

8 Mar, 2019 07:23 IST|Sakshi
మహిళా ఓటర్లు

జిల్లాలో మహిళా ఓటర్లే అధికం

తూర్పుగోదావరి, రాయవరం (మండపేట), కాకినాడ సిటీ : రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ పార్టీలకు ప్రతి అంశం కీలకమే. ఇక్కడ సామాజిక సమీకరణలతో పాటు, మహిళా ఓటర్ల తీర్పూ ముఖ్యమైనదే. జిల్లాలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పటి నుంచే ఆయా రాజకీయ పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఎందుకంటే జిల్లాలో పురుషుల ఓటర్ల కన్నా మహిళా ఓటర్ల సంఖ్య అధికం.

ఇదీ లెక్క
జిల్లాలో 19 నియోజకవర్గాల్లో.. ఎనిమిది నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల హవా కనిపిస్తోంది. జిల్లాలో మొత్తం 40 లక్షల 13,770 మంది ఓటర్లు ఉండగా అందులో అత్యధికంగా మహిళలు 20లక్షల 18,747 మంది, 19లక్షల 94,639 మంది పురుష ఓటర్లు ఉన్నారు. పురుషుల కన్నా మహిళల ఓట్లు 24,108 అధికం. మిగిలినవి థర్డ్‌ జండర్‌ ఓట్లు 384 ఉన్నాయి. 2014లో 37లక్షల 73,322 మంది ఓటర్లు జిల్లాలో ఉన్నారు. 

ఎనిమిది నియోజకవర్గాలు మినహా
జిల్లా పిఠాపురం, కాకినాడరూరల్, రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట నియోజకవర్గాలు మినహాయిస్తే మిగిలిన 11 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. అమలాపురం నియోజకవర్గంలో మహిళా ఓటర్ల కన్నా పురుష ఓటర్లు ఒక్కరే ఎక్కువ. తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం, అనపర్తి, కాకినాడ సిటీ, మండపేట, రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.

జిల్లాలో ప్రజాప్రతినిధులు
జిల్లాలో 19 నియోజకవర్గాలకు సంబంధించి 64 మండలాలు ఉండగా, 32 మంది జెడ్పీటీసీ సభ్యులు, 32 మంది ఎంపీపీలు,  1104 మంది ఎంపీటీసీ సభ్యులు పదవులు ఉండగా వాటిలో 552 మంది ఎంపీటీసీ సభ్యుల్లో మహిళలు పదవుల్లో కొనసాగుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున మహిళలు పదవుల్లో ఉన్నా నేటికీ వారిలో చాలా మంది మహిళలు పదవులను అనుభవించకుండా భర్తలు షాడోలుగా వ్యవహరిస్తూ కార్యక్రమాలను చక్కబెడుతున్నారు. వీరిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన మహిళా ప్రతినిధులు నేటికీ తమ పదవులను స్వచ్ఛందంగా అనుభవించలేకపోతున్నారనేది నగ్నసత్యం. ఇకపై షాడో వ్యవస్థకు మంగళం పాడేలా మహిళలు వ్యవహరించేందుకు కార్యక్రమాలను చేపట్టాలని మహిళా లోకం స్పష్టం చేస్తుంది.

మహిళల సంక్షేమానికే ఓటు
మహిళ సంక్షేమానికి, సంరక్షణకు చర్యలు తీసుకునే వారికే మహిళలు ఓటు వేస్తామని ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. టీడీపీ హయాంలో మహిళలపై దురాగతాలు ఎక్కువయ్యాయని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మాకు హామీ ఇచ్చి నమ్మకం కలిగించే పార్టీకే పట్టం కడతామని మహిళలు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు