ఇక్కడ పనిచేయలేం!

18 Apr, 2016 01:15 IST|Sakshi

మహిళా వైద్యులన్న గౌరవమే లేదు
వీఆర్‌ఎస్ తీసుకున్న ప్రసూతి విభాగాధిపతి
అదే బాటలో మరికొందరు వైద్యులు
ఇదీ ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితి

 

విజయవాడ (లబ్బీపేట) : వారంతా సమాజంలో ఎంతో ఉన్నతమైన వృత్తిలో ఉన్నవారు. అలాంటివారిని నిత్యం వేధించడం, అమర్యాదకరంగా వ్యవహరించడం, మాట్లాడడం చేస్తుంటే తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధుల తాలూకా అంటూ ఒకరు.. మంత్రి కార్యాలయం నుంచి అంటూ మరొకరు.. అభివృద్ధి కమిటీ పేరు చెప్పి ఇంకొకరు.. ఇలా ఎవరు పడితే వారు మహిళా డాక్టర్లకు ఫోన్లు చేసి ఏకవచనంతో మాట్లాడడంతో మనస్తాపానికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడంకన్నా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయడం మంచిదని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రసూతి  విభాగాధిపతి వీఆర్‌ఎస్‌పై వెళ్లిపోగా, మరికొందరు వైద్యులు అదే బాటపడుతున్నారు.

 
అభివృద్ధి కమిటీ పేరుతో దబాయింపు

ఆస్పత్రి అభివృద్ధి కమిటీలో వైద్య రంగంపై ఏమాత్రం అవగాహన లేని సభ్యులను నియమించడంతో వారితో వైద్యులకు పెద్ద తలనొప్పిగా మారింది.  ఒక సభ్యుడు నిత్యం ఏదో ఒక విభాగానికి వె ళ్లడం ..నేనెవరో తెలుసా..  ఉద్యోగం చేయాలని లేదా? అంటూ వైద్యుల నుంచి నర్సింగ్., నాలుగో తరగతి సిబ్బంది వరకు బెదిరింపులకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. పురుషులకు ప్రవేశం లేని లేబర్ వార్డుకు సైతం వెళ్లి దబాయిస్తున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది.

 

సౌకర్యాల గురించి పట్టించుకోరు

ప్రభుత్వాస్పత్రిలో 24 గంటల రక్తపరీక్షలు నేటికీ అందుబాటులోకి రాలేదు. అర్ధరాత్రి రక్తపరీక్షలు చేయాలన్నా, స్కానింగ్ తీయాలన్నా బయటకు వెళ్లాల్సిందే. దీని గురించి ఒక్క నాయకుడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రసూతి విభాగాన్ని ఆరు యూనిట్లు చేయాలని మొరపెట్టుకున్నా ఒక్క నాయకుడూ స్పందించలేదు. కేవలం 40 పడకలు కొనుగోలు చేసి చేతులు దులుపుకొన్నారు. వైద్యులు, సిబ్బంది ఎక్కడి నుంచి వస్తారో నాయకులకే ఎరుక. అసలు వైద్యంపై ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులను ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులుగా నియమించినప్పుడే ప్రభుత్వ తీరు అర్థమయిందని సీనియర్ వైద్యులు పేర్కొంటున్నారు. ఇక్కడ పనిచేయడం కంటే రాజీనామా చేసి వెళ్లిపోవడమే మేలనే నిర్ణయానికి వైద్యులు వచ్చేసినట్లు తెలుస్తోంది.

 
సూపరింటెండెంట్‌దీ అదే పరిస్థితి

ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా అడిషనల్ డెరైక్టర్ హోదాలో ఉన్నవారు పనిచేస్తుంటారు. ప్రస్తుతం పనిచేస్తున్న డాక్టర్ సూర్యకుమారికి సైతం అడ్మినిస్ట్రేషన్‌లో 25 ఏళ్ల అనుభవం ఉంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళా యూరాలజిస్ట్. మరో మూడు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆమె పరిస్థితి కూడా అలాగే మారింది. ఒక  దశలో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. ఆమె వెళితే ఆ సీట్లో కూర్చునేందుకు ఏ ఒక్కరూ సిద్ధపడే పరిస్థితి లేదు. మూడేళ్ల కిందట నెలలో ముగ్గురు సూపరింటెండెంట్‌లు మారిన చందంగా మళ్లీ ఆస్పత్రి పరిస్థితి తయారవుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న సీనియర్లలో ఏ ఒక్కరూ ఆ సీట్లు కూర్చునేందుకు ఆసక్తి చూపడంలేదు.

 

నిత్యం తిట్ల దండకం
‘నేనెవరో తెలుసా..ఏం మాట్లాడుతున్నావ్..ఉద్యోగం చేయాలని లేదా...’ అంటూ మహిళా వైద్యురాలు అని కూడా చూడకుండా  ఫోన్‌లో బెదిరింపు ధోరణులు. ‘ఏమిటి..  మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తారా..’ అంటూ తిట్లపురాణం..ఇలా గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న మహిళలతో పాలకులు ఏకవచనంతో మాట్లాడటంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. మంత్రిగారి పేషీ అంటూ ఒకరు.. ఎమ్మెల్యే తాలూకా అంటూ మరొకరు నిత్యం ఫోన్‌లు చేస్తూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడడంపై వైద్యులు చిన్నబుచ్చుకుంటున్నారు. ఇలాంటి వేధింపులు ఎప్పుడూ చూడలేదని ఒక సీనియర్ డాక్టర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు