కదం తొక్కిన మహిళా కార్మికులు

19 Dec, 2014 01:37 IST|Sakshi
కదం తొక్కిన మహిళా కార్మికులు

 ఏలూరు (బిర్లాభవన్ సెంటర్) : కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కదంతొక్కి గర్జించారు. గురువారం కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అంగన్‌వాడీలు, ఐకేపీ యానిమేటర్లు, ఆశ వర్కర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్థానిక సీఐటీయూ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సంస్థల జపం చేస్తూ చిరుద్యోగుల కడుపుకొడుతున్నారని విమర్శించారు.
 
 రాష్ట్రంలో 20 నెలల నుంచి యానిమేటర్లకు, ఆశ వర్కర్లకు గౌరవ వేతనాలు ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకాయల బాబూరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు జాబు కావాలంటే బాబు రావాలంటూ ప్రచారం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు మారిన మనిషినంటూ ప్రచారంతో ప్రజలను నమ్మించి అధికారం చేపట్టాక అసలు రూపాన్ని బయటపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
 
 కార్మికులకు కనీస వేతనాలు రూ.15 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రతను కల్పించాలని, చిరుద్యోగులపై వేధింపులు ఆపాలని, పెండింగ్‌లో ఉన్న బకాయి వేతనాలు చెల్లించాలని, అంగన్‌వాడీలకు రూ.800 వేతనం పెంచాలని కార్మికులు చేసిన నినాదాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. ఈ ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు డీఎన్‌వీడీ ప్రసాద్, సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మంతెన సీతారాం, ఆర్.లింగరాజు, బి.సోమయ్య, జీవీఎల్ నర్సింహరావు, వివిధ సంఘాల నాయకులు ఎ.శ్యామలారాణి, కె.విజయలక్ష్మి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు