అడ్డుపడవద్దంటూ చంద్రబాబుకు లేఖలు

14 Jul, 2020 19:26 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పేదలకు సొంతిళ్లు నిర్మించి ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పానికి అడుగడుగునా అడ్డు తగులుతున్న తెలుగుదేశం పార్టీపై జిల్లా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారి సొంతింటి కల, ఇళ్ళ పట్టాల పంపిణీకి అడ్డుపడవద్దంటూ ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు లేఖలు రాశారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంటి అడ్రస్‌తో లేఖలు పోస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్ధనపురం పోస్ట్‌ ఆఫీసు వద్ద మహిళలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. (30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఆస్తి రూ. 20000 కోట్లు)


ఈ సందర్భంగా ఓ మహిళ తన ఆవేదన పంచుకుంటూ.. ‘‘మాకు ఇళ్లపట్టాలు మంజూరయ్యాయి. 370 మందికి వచ్చాయి. ఇప్పటికే పట్టాలు చేతికి రావాల్సింది. చంద్రబాబు కోర్టుకు వెళ్లడం మూలాన అన్నీ ఆగిపోయాయి. పదిహేనో తారీఖు(ఆగస్టు)న కూడా వచ్చేదాకా నమ్మకం లేదు. దయచేసి కోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకుంటే మాకు ఇళ్లపట్టాలు వస్తాయి. ఇప్పటివరకు మాకు ఇల్లు లేదు. మీ హయాంలో మాకు సెంటు భూమి కూడా రాలేదు. ఇప్పుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా పట్టాలు ఇస్తున్నారు. అయినా గానీ మీరు అడ్డంపడుతున్నారు. దయచేసి మీరు కేసు వెనక్కి తీసుకోండి. అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది’’అని చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. 

కాగా జూలై 8న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తెలుగుదేశం నాయకులు గతంలో కోర్టుకు వెళ్లడంతో, ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కోవిడ్‌ కారణంగా కేసులు డిస్పోజ్‌ కాకపోవడంతో.. పేదలందరికీ ఆగస్టు 15వ తేదీన ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

మరిన్ని వార్తలు