సిండికేట్లదే గెలుపు

30 Jun, 2015 01:48 IST|Sakshi
సిండికేట్లదే గెలుపు

- 328 మద్యం షాపులకు లాటరీ
- అనుకున్నది సాధించిన సిండికేట్లు
- చేయి కలిపిన రియల్టర్లు, అధికారులు?
- ఆందోళన చేసిన మహిళలు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం:
ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించిన పాలసీ ప్రకారం సోమవారం మద్యం షాపుల కేటాయింపు జరిగింది. ఉదయం 10 గంటలకే ప్రారంభమైన లాటరీ ప్రక్రియ తెల్లవారు జాము వరకూ సాగింది. జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్,జాయింట్ కలెక్టర్ జె.నివాస్, ఎక్సైజ్ కమిషనర్ శ్రీనివాస శ్రీనరేష్, ఎక్సైజ్ డీసీ ఎం.సత్యనారాయణలు
 
కైలాసపురంలోని డాడ్ లేబర్ బోర్డ్ కళ్యాణమండపంలో మద్యం దుకాణాలకు లాటరీ తీశారు. ప్రభుత్వ తీరకు నిరసనగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన నిర్వహించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోనే గతేడాది మద్యం అమ్మకాల్లో రికార్డు సృష్టించిన విశాఖ జిల్లా  కేటాయింపుల్లోనూ అదే ఒరవడి కొనసాగించింది.  406 మద్యం షాపుల్లో 39 షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించి మిగతా 367 షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తే 328 షాపులకు 5835 దరఖాస్తులు దాఖలయ్యాయి. 39 షాపులకు ఒక్క దరఖాస్తు దాఖలు కాలేదు. దీంతో 328 షాపులకు సోమవారం కేటాయింపు ప్రక్రియ ప్రారంభించారు. రాత్రి 8 గంటల ప్రాంతానికి దాదాపు 200 షాపులకు లాటరీ తీశారు.

అన్ని షాపులకు లాటరీ తీయడానికి అర్ధరాత్రి దాటిపోతుందని డీసీ వెల్లడించారు. రెడ్డి సీతారాం అనే వ్యక్తి గెజిట్ నెం.118,119లకు సింగిల్ టెంటర్లు వేశారు. లాటరీకి అటెండ్ కాకపోవడంతో అతనికి ఒక షాపు మాత్రమే కేటాయిస్తామని కలెక్టర్ ప్రకటించారు. సిండికేట్లు, రియల్టర్లదే హవా: మద్యం షాపులకు దరఖాస్తు చేయడం దగ్గర్నుంచి లాటరీ పూర్తయ్యే వరకూ సిండికేట్లు చక్రం తిప్పారు. అనుమానం రాకుండా వారు అనుకున్నది చేయగలిగారు. సింగిల్ టెండర్లు, డబుల్ టెండర్లు, మూడు నుంచి 10 టెండర్లు..ఇలా వచ్చిన దరఖాస్తులన్నీ సిండికేట్ల మాయాజాలమేనంటే నమ్మకతప్పదు. 59 షాపులకు సింగిల్ దరఖాస్తులు వచ్చాయి.

దాదాపుగా ఇవన్నీ సిండికేట్ల కనుసన్నల్లో వచ్చినవేనంటున్నారు. గాజువాకలో 30, అనకాపల్లిలో 16, విశాఖలో 13 షాసులు సిండికేట్ల చేజిక్కిట్లేనని భావించవచ్చు.  మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల మందగించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి కొందరు రియల్టర్లు, ఉన్నతాధికారులు తమ పెట్టుబడులను మద్యం దుకాణాలవైపు మళ్లించినట్లు తెలుస్తోంది. పలువురు ఉన్నతాధికారులు తాము వెనకుండి బినామీలతో దరఖాస్తులు చేయించినట్లు సమాచారం. ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు మద్యం దుకాణాలను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు.  గ్రామీణ, ఏజెన్సీ పరిధి లోని షాపులకోసం 4665 దరఖాస్తులు రాగా కేవలం సిటీ పరిధిలోని 60షాపులకు 1170దరఖాస్తులు రావడంతో ఆ విషయం స్పష్టమవుతోంది. సిటీని ఆనుకుని ఉన్న గాజువాక, అనకాపల్లి ప్రాంతాల్లోని షాపులకు ఇవే డిమాండ్ ఏర్పడింది.

ప్రభుత్వామే వత్తాసు పలికితే ఎలా?
ఐద్యా, ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేపట్టారు.  మంచినీళ్లు ఇవ్వండి బాబూ, మద్యం వద్దు అంటూ నినాదాలు చేశారు. షాపింగ్ మాల్స్‌లో మద్యం అమ్మకాలు ఏంటని నిలదీశారు.డిఎల్‌బి కళ్యాణమండపంలోకి దూసుకువెళ్లి లాటరీ ప్రక్రియను అడ్డుకోవాలని ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని వారించి వెనక్కు పంపాలని చూశారు. కుదరకపోవడంతో అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. డిఎల్‌బీకి కిలో మీటరు దూరంలోనే మహిళలను అడ్డుకున్న  పోలీసులు వారిని నిర్ధాక్షిణ్యంగా ఈడ్చిపాడేశారు.

మరిన్ని వార్తలు