గృహిణి నుంచి ఎమ్మెల్యే వరకు...

8 Mar, 2015 01:26 IST|Sakshi

విజయనగరం మున్సిపాలిటీ: ఓ సాధారణ గృహిణి నుంచి ఎమ్మెల్యే వరకు ఆమె ఎదిగిన తీరు ఎవరికైనా ఆదర్శప్రాయమే. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు విజయనగరం ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్న మీసాల గీత ప్రస్థానం ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది. మొదట్లో గృహిణిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె మున్సిపల్ కౌన్సిలర్‌గా, మున్సిపల్ చైర్మన్‌గా పదవులు అలంకరించారు. అనంతరం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆమె సేవలను గుర్తించిన టీడీపీ సర్కారు రాష్ట్ర శాసనసభ ఉమెన్, చిల్డ్రన్ డిజేబుల్ అండ్ ద ఓల్డేజ్ కమిటీ చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి కె.సత్యనారాయణ రావు ఉత్తర్వులు జారీచేశారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మీసాల గీతకు ఈ గౌరవం దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
 
  ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో రాణించటం ఓ మహిళగా గర్వంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు మహిళలు రాజకీయంగా ఎదిగేలా తోడ్పాటునివ్వటంతో పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని ఆమె అన్నారు. ఒకప్పుడు మహిళ వంటింటికే పరిమితమైతే నేడు అంతరిక్ష పర్యటనలు చేస్తూ పురుషులతో సమానంగా కాకుండా ఇంకా ధీటుగా ఎదుగుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో మహిళల ప్రాధాన్యత కీలకంగా మారిందన్నారు. అయితే ప్రస్తుతం సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు నివారించాలని అన్నారు.  
 

మరిన్ని వార్తలు