సరికొత్త సూర్యోదయం..

25 Aug, 2019 05:32 IST|Sakshi

బెల్టుషాపుల రద్దుతో అక్కచెల్లెమ్మల జీవితాల్లో ఆనందం  

తమ కుటుంబాలు బాగుపడుతున్నాయంటూ హర్షం   

తమ బతుకుల్లో వెలుగులు నింపారంటూ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు  

గతేడాది జూన్, జూలైలో రాష్ట్రంలో 63.93 లక్షల కేసుల మద్యం విక్రయం  

ఈ ఏడాది జూన్, జూలైలో తగ్గిన అమ్మకాలు 8.15 లక్షల కేసులు 

సత్ఫలితాలిస్తున్న దశలవారీ మద్య నిషేధం 

నూతన ప్రభుత్వం అమలు చేస్తున్న దశలవారీ మద్య నిషేధం.. సమాజంలో అద్భుత ఫలితాలనిస్తోంది. పేద కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఆర్థిక దుస్థితి, అనారోగ్యం బారిన పడిన బడుగుల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. అక్కచెల్లెమ్మలు, అవ్వల కళ్లల్లో ఆనందపు మెరుపులు ఆవిష్కృతమవుతున్నాయి.  
– సాక్షి, గుంటూరు 

మా బతుకులు బాగుపడుతున్నాయి 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దశలవారీ మద్య నిషేధ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు మా గ్రామస్తులంతా  స్వాగతించారు. రోజంతా కష్టపడిన సొమ్మును మా మగాళ్లు తాగుడుకే ఖర్చు చేస్తున్నారు. స్థానిక 15 మహిళా సంఘాల ఆధ్వర్యంలో  తాజా మాజీ సర్పంచ్‌ మువ్వల ఆదయ్య, నాయకులు, యువతతో గ్రామంలో సమావేశం నిర్వహించుకుని వైఎస్‌ జగన్‌ నిర్ణయానికి మద్దతుగా గ్రామంలో బెల్ట్‌షాప్‌లు నిర్వహించకూడదని ఈ ఏడాది జూలైలో తీర్మానం చేసుకున్నాం. ఇప్పుడు మా అందరి బతుకులు బాగుపడుతున్నాయి.     
– మువ్వల బాలమ్మ, మెట్టవలస గ్రామం, సాలూరు మండలం, విజయనగరం జిల్లా

వైఎస్‌ జగన్‌ నిర్ణయంతో.. 
బెల్ట్‌ షాపులను నిర్మూలిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం సమాజంలో పెను మార్పునకు శ్రీకారం చుట్టింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రెండోరోజే.. రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధంలో భాగంగా బెల్టు షాపుల నిర్మూలనకు ఆదేశించారు. బెల్టు షాపులు మూతపడ్డాయి. పచ్చని కాపురాల్లో చిచ్చు రాజేసే మద్యం మహమ్మారి ప్రవాహానికి అడ్డుకట్టపడ్డట్టయింది.  

టీడీపీ ప్రభుత్వ హయాంలో 24గx7 మద్యం సరఫరా 
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలకు అనుబంధంగా 43 వేల బెల్ట్‌ షాపులుండేవి. అనధికారికంగా కొనసాగుతున్న బెల్ట్‌ షాపుల్లో 24 గంటలూ మద్యం విక్రయాలు జరిగేవి. మంచి నీళ్లు దొరకని గ్రామాలైతే ఉన్నాయిగానీ.. మద్యం దొరకని గ్రామమంటూ లేనంతగా పరిస్థితి తయారైంది. తాగుడుకు బానిసలైన కొందరు.. మద్యం కొనుగోలుకు డబ్బు ఇవ్వలేదని భార్య, తల్లిదండ్రులను కడతేర్చిన ఘటనలు గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. తాగుడుకు బానిసలైనవారు అనారోగ్యం పాలై కుటుంబ సంపాదనంతా ఆస్పత్రులకు చెల్లించాల్సి వచ్చేది.  

మహిళలంతా సంతోషంగా ఉన్నారు   
గత ప్రభుత్వంలో ఏ గ్రామంలో చూసినా బెల్ట్‌షాపులుండేవి. తాగుబోతు తనం ఎక్కువ వడంతో పాటు..  కొట్లాటలు కూడా జరిగేవి. ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో గ్రామాల్లో బెల్ట్‌షాపులను అరికట్టడం వల్ల గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయి. అంచెలంచెలుగా సీఎం వైఎస్‌ జగన్‌ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పడంతో మహిళలంతా సంతోషంగా  ఉన్నారు.  
– కలై అరసి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు, నంగమంగళం, చిత్తూరు జిల్లా 

శుభ పరిణామం.. 
రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధంలో భాగంగా ప్రభుత్వం బెల్ట్‌ షాపులను నిర్మూలిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. ప్రజలను మద్యం నుంచి దూరం చేయాలంటే వారికి మద్యం అందుబాటులో లేకుండా చేయడమే సరైన నిర్ణయం. మద్య నిషేధంలో భాగంగా బెల్ట్‌ షాపులను ఎత్తివేసి ప్రభుత్వం తొలి విజయం నమోదు చేసుకుంది. ఇదే స్ఫూర్తితో సీఎం జగన్‌ ముందుకెళ్తూ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయాలి.
– వి.లక్ష్మణరెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు 

మద్యం దొరక్కుండా చేయాలి.. 
నా భర్తకు 70 ఏళ్లయ్యా.. ఆయన సంపాదనతో పాటు, నా రెక్కల కష్టం కూడా తాగుడుకే తగలేసేవాడు. కూలిపనులు చేస్తూ పిల్లల్ని పోషించాను. 70 ఏళ్ల వయస్సులోనూ తాగుడుకు డబ్బులివ్వాలంటూ నన్ను సతాయించేవాడు. మునుపటిలా ఇప్పుడు ఊళ్లో మద్యం దొరక్కపోవడంతో తాగుడు దాదాపు తగ్గిపోయింది. రాజన్న బిడ్డ నిర్ణయంతో నా కుటుంబంతో పాటు.. మా ఊళ్లో చాలా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. 
– సానంపూడి శేషమ్మ, వెల్లంపల్లి, మాచవరం మండలం, గుంటూరు జిల్లా  

రెండు నెలల్లోనే తగ్గిన అమ్మకాలు 8,15,806 కేసులు 
ఏటా పెరుగుతున్న అమ్మకాలు 10% 
ప్రభుత్వ నిర్ణయం వల్ల తగ్గిన అమ్మకాలు 12% 
ఒక కేసు అంటే 8.64 లీటర్ల మద్యం 

ఈ ఫొటోలో కనిపిస్తున్న జరపాల బుజ్జీబాయ్‌ది గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం, రేమిడిచర్ల గ్రామం. ఈమె భర్త చినబాబు మద్యానికి బానిస. పనికెళ్లకుండా 24 గంటలూ మద్యం తాగుతూ భార్యాపిల్లలను వేధించేవాడు. బుజ్జీబాయ్‌ తన కూలిలో నెలకు రూ.4 వేల దాకా భర్త తాగుడుకు ఇవ్వాల్సి వచ్చేది. కొత్త ప్రభుత్వ నిర్ణయంతో బెల్ట్‌ షాపులన్నీ మూతపడ్డాయి. మద్యం అందుబాటులో లేకపోవడంతో చినబాబు తాగడం మానుకున్నాడు. పనికెళుతూ రోజుకు రూ.200 సంపాదిస్తున్నాడు. దీంతో నెలకు రూ.4 వేల తాగుడు ఖర్చు మిగలడమేగాక.. అదనపు ఆదాయం తోడవడంతో హాయిగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు