మహిళా సంఘాలకు ఆన్‌లైన్ మార్కెట్ సౌకర్యం

1 May, 2016 03:22 IST|Sakshi
మహిళా సంఘాలకు ఆన్‌లైన్ మార్కెట్ సౌకర్యం

తిరుపతి, రాజంపేటను ఆదర్శ సిటీలుగా తీర్చిదిద్దుతాం
సెర్ప్ సీఈవో సాల్మన్ ఆరోఖ్య రాజ్ వెల్లడి
తిరుపతిలో నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల మెప్మా సిబ్బందితో సమీక్ష

 
తిరుపతి కార్పొరేషన్ :
పొదుపు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆన్‌లైన్ మార్కెట్ సౌకర్యాన్ని కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర సెర్ప్ సీఈవో సాల్మన్ ఆరోఖ్య రాజ్ తెలిపారు. తిరుపతి నగరంలో శనివారం నె ల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలోని మెప్మా అధికారులతో వివిధ మున్సిపల్, కార్పొరేషన్లలో జీవనోపాధుల అమలు తీరుపై ప్రాంతీయ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాల్మన్ ఆరోఖ్య రాజ్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు, స్లమ్ లెవల్ ఫెడరేషన్, టౌన్ లెవల్ ఫెడరేషన్ స్థాయిలో పొదుపులు, అప్పుల వసూళ్లపై సక్రమంగా  చర్యలు తీసుకోవాలన్నారు.

రుణాలు పొందిన సంఘ సభ్యురాలు రుణ మొత్తాన్ని జీవనోపాధి యూనిట్‌ను పెట్టుకునే విధంగా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. రాష్ట్రంలో గత  ఆర్థిక సంవత్సరానికి గాను రూ.9,500 కోట్లు వివిధ బ్యాంకు లింకేజీ ద్వారా మెప్మా పరిధిలోని గ్రూపులకు రుణాలు అందించామన్నారు. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని స్పష్టం చేశారు.

ప్రతి డ్వాక్రా బజారులో పొదుపు మహిళలు తయారుచేసిన వస్తువులను ఇంటర్ నెట్ ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహించుకునేలా చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడు ప్రధాన నగరాల్లో సెర్ప్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా వస్తువులు విక్రయాలు చేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్నంలో ఆన్‌లైన్ మార్కెట్ సౌకర్యం పొదుపు సంఘాలు నిర్వహిస్తున్నట్టు గుర్తుచేశారు.


అదే తరహాలో తిరుపతిలో కూడా ఆన్‌లైన్ మార్కెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని, తిరుపతితో పాటు రాజంపేట నగరాలను మోడల్‌గా తీర్చిదిద్దనున్నట్టు స్పష్టంచేశారు. మే మొదటి వారంనుంచి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో సెర్ప్ స్పెషల్ డెరైక్టర్ చిన్నతాతయ్య, చిత్తూరు మెప్మా పీడీ నాగపద్మజ, కడప పీడీ వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు