వెంకటగిరి సీహెచ్‌సీలో ఉద్రిక్తత

23 Oct, 2018 13:39 IST|Sakshi
ఆస్పత్రి వద్ద ధర్నా చేస్తున్న ఏఎన్‌ఎం జ్యోతి, బాలింతలు, బంధువులు

డాక్టర్‌ శ్రీనివాస్‌ తనను మెడపట్టి గెంటివేశాడని ఏఎన్‌ఎం ఆవేదన

బాలింతలకు కు.ని ఆపరేషన్ల విషయంలో వివాదం

ఏఎన్‌ఎంకు మద్దతుగా బాలింతలు, బంధువుల నిరసన

డాక్టర్‌ క్షమాపణ చెప్పడంతో సర్దుమణిగిన వివాదం   

నెల్లూరు, వెంకటగిరి: కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ కోసం బాలింతలను తీసుకువచ్చిన ఏఎన్‌ఎంపై కమ్యునిటీ హెల్త్‌సెంటర్‌ వైద్యాధికారి అనుచితంగా ప్రవర్తించడంతో సోమవారం ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల జోక్యంతో వివాదం సర్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. శ్రీకాళహస్తి  మండలంలోని ఇలగనూరు వైద్యారోగ్య కేంద్రం పరిధిలో జ్యోతి అనే మహిళ ఏఎన్‌ఎంగా పనిచేస్తోంది. ఆమె ప్రతి సోమవారం బాలింతలకు వెంకటగిరి సీహెచ్‌సీలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తుంటుంది. ఈ క్రమంలో నలుగురు బాలింతలను ఆపరేషన్‌కు సిద్ధంచేసి ఆదివారం సీహెచ్‌సీ వైద్యుడు శ్రీనివాస్‌కు సమాచారం అందించింది. సోమవారం ఉదయం శ్రీనివాస్‌ ఆస్పత్రిలో మరో గైనకాలజిస్ట్‌ సెలవుపై వెళ్లారని, ఆపరేషన్లు నిర్వహించడంలేదని జ్యోతికి శ్రీనివాస్‌ ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఆమె తన ఏరియా పరిధిలోని బాలింతలకు ఆ సమాచారం చేరవేశారు. అయితే అప్పటికే ఇద్దరు బాలింతలు ఆస్పత్రికి చేరుకోగా మరో ఇద్దరు మార్గమధ్యలో ఉన్నారు. కాగా జ్యోతి తను విధులు నిర్వర్తించే ఎంపేడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లింది.

తోటి ఏఎన్‌ఎంల ద్వారా వెంకటగిరి ఆస్పత్రిలో కు.ని ఆపరేషన్లు చేస్తున్నారని తెలుసుకుంది. తన ఏరియా పరిధిలోని బాలింతలకు మాత్రం ఎందుకు నిరాకరించారో తెలసుకుందామని ఆమె ఆస్పత్రికి వెళ్లింది. ఆ సమయంలో ఎనిమిది మందికి ఆపరేషన్లు చేసేందుకు సిద్ధం చేస్తున్న వైద్యుడు శ్రీనివాస్‌ వద్దకు వెళ్లి మాట్లాడింది. తాను తీసుకువచ్చిన బాలింతలకు ఎందుకు ఆపరేషన్లు నిర్వహించడం లేదని అడిగింది. గిరిజన, దళితవర్గాలకు చెందిన బాలింతలు వ్యయప్రయాసలతో ఆస్పత్రికి వస్తే తిరిగి పంపడం ఏంటని ప్రశ్నించింది. దీంతో ఆగ్రహనికి గురైన శ్రీనివాస్‌ కు.ని ఆపరేషన్లు అత్యవసర సేవలా?, గురువారం చేస్తాం. అప్పుడు బాలింతలను తీసుకురావాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు. చేస్తే అందరికీ చేయాలని, లేకుంటే వాయిదా వేయాలని తాను అనడంతో ఆగ్రహానికి గురైన డాక్టర్‌ మెడపట్టి గెంటివేశాడని ఏఎన్‌ఎం జ్యోతి విలపిస్తూ అక్కడున్న బాలింతలకు చెప్పింది. విషయం తెలుసుకున్న ఏఎన్‌ఎం బంధువులు, కొందరు బాలింతలు ఆస్పత్రి వద్దకు చేరుకుని వైద్యుడు శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈనేపథ్యంలో డాక్టర్‌ ఇచ్చిన సమాచారంతో ఎస్సై నాగయ్య ఆస్పత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. ఇరువర్గాలతో మాట్లాడారు. డాక్టర్‌ ఏఎన్‌ఎంకు క్షమాపణ చెప్పడంతో వివాదం సర్దుమణిగింది.  

గతంలోనూ వివాదాలు
వైద్యాధికారి శ్రీనివాస్‌ వ్యవహారశైలిపై గతంలోనూ వివాదాలు చోటుచేసుకున్నాయి. మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి జాన్‌ భార్యకు ఆస్పత్రిలో ట్యూబెక్టమీ ఆపరేషన్‌ చేయగా వేసిన కుట్లు ఊడిపోయాయి. దీనిపై ప్రశ్నించిన జాన్‌తో వివాదం జరిగింది. పోస్టుమార్టం కేసుల్లో జాప్యం జరుగుతున్న వైనంపై బంధువులతో వివాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. రెండురోజుల క్రితం వెంకటగిరి పరిధిలో జరిగిన ఓ మహిళ హత్యకేసులో స్థానికంగా శవపరీక్ష చేయకపోవడంతో పోలీసులు నెల్లూరుకు వెళ్లాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు