మద్యంపై మహిళల శంఖారావం

20 Jan, 2014 00:35 IST|Sakshi

దౌల్తాబాద్, న్యూస్‌లైన్: విచ్చలవిడిగా బెల్టుషాపులు నిర్వహిస్తుండటంతో ఘర్షణలు తలెత్తుతు న్నాయని పలువురు మద్యానికి బా నిసలు కావడంతో కుటుంబాలు వీధీన పడుతున్నాయని ఆగ్రహించిన మహిళలు చేయిచేయి కలిపి మద్యంపై శంఖారావం పూరించారు. దౌల్తాబాద్ మండలం అనాజీపూర్ గ్రామంలో ఆదివారం సర్పంచ్ కొత్త వెంకమ్మ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు పంచాయతీ కార్యాలయంలో సమావేశమయ్యాయి. మద్యం మహమ్మారిని తరిమివేయాలని నిర్ణయించారు.

అంతే గ్రామంలో బెల్టుషాపులను నిషేధిస్తూ తీర్మానం చేశారు. ఇకమీదట గ్రామంలో మద్యం విక్రయాలు జరిగితే చర్యలు తీసుకోవాలని నిర్ణయంచారు. వారి నిర్ణయానికి ఉప సర్పంచ్ వంజరి శ్రీనివాస్‌తో సహా వార్డు సభ్యులు, గ్రామపెద్దలు మద్దతు ప్రకటించి, పంచాయతీ కార్యాలయం వద్ద మద్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి బెల్టుషాపుల నిర్వాహకులకు హెచ్చరికలు జారీచేశారు. మద్యం విక్రయాలను నిలిపివేయాలంటూ ఆదేశించారు. ఇక మీదట మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 పోలీసుల సంఘీభావం
 అనాజీపూర్ గ్రామంలో మహిళాసంఘాలు సమావేశమై బెల్టుషాపులను నిర్వహించొద్దని నిర్ణయం తీసుకున్న విషయం తెలుసుకున్న తొగుట సీఐ రమేష్‌బాబు, దౌల్తాబాద్ ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. మహిళల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలు చైతన్యమైతే అక్రమ మద్యం విక్రయాలు తగ్గుముఖం పడతాయని సూచించారు. గ్రామంలో ఇకమీదట బెల్టుషాపులు నిర్వహిస్తే వెంటనే సమాచారం అందించాలని చెప్పారు. ఎవరూ మద్యం విక్రయాలను చేపట్టవద్దని పేర్కొన్నారు. అలాంటివారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు