జగన్నాథా.. మేలుకో!

10 May, 2019 10:45 IST|Sakshi
పోస్టునేటల్‌ వార్డులో తాళం వేసిన బాలింతల బాత్‌రూం

మహిళలకు ‘పరీక్ష’!

మహిళలు, గర్భిణులకు ప్రత్యక్ష నరకం

యూరిన్‌ పరీక్షలు సొంతంగా చేసుకోవాల్సిందే..

బాలింతల బాత్‌రూంకు తాళాలు

అత్యవసరమైతే.. ఇతర వార్డులకు పరుగులు

ప్రభుత్వాసుపత్రిలో దిగజారిన సేవలు

ఈ ఫొటోను చూడండి. గైనిక్‌ ఓపీ లేబొరేటరీ ఎదుట ఈ మహిళ ప్రెగ్నెన్సీ స్ట్రిప్‌తో సొంతంగా పరీక్ష చేసుకుంటోంది. వాస్తవంగా గర్భం దాల్చారా? లేదా? అనే విషయమై గైనిక్‌ వైద్యులు యూరిన్‌ పరీక్షకు రెఫర్‌ చేస్తారు. ల్యాబ్‌ సిబ్బంది యూరిన్‌ సేకరించి పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆసుపత్రిలో దిగజారిన వైద్య సేవలకు అద్దం పడుతోంది.

అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో సేవలు నానాటికీ దిగజారుతున్నాయి. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన ఆసుపత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యమే. ప్రధానంగా గైనిక్‌ ఓపీ, పోస్టునేటల్‌ వార్డులో గర్భిణిలు, బాలింతలు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఎంతలా అంటే.. యూరిన్‌ పరీక్షలు కూడా సొంతంగా చేసుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. ఇక బాలింతల బాత్‌రూంలు శుభ్రపరిచే ఓపిక లేక ఏకంగా తాళాలు వేయడం గమనార్హం. ఈ కారణంగా అత్యవసర సమయంలో బాలింతలు ఇతర వార్డులకు పరుగు తీయాల్సి వస్తోంది. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే గైనిక్‌ సేవలు ఈ స్థాయికిదిగజారినట్లు తెలుస్తోంది. మహిళా రోగులకు సర్వజనాస్పత్రిలో అందుతున్న సేవలను పరిశీలిస్తే ఈ సమాజం ఎటువైపు పయనిస్తోందనే అనుమానం కలుగక మానదు. మహిళ గర్భం దాల్చిందా? లేదా? అనేందుకు నిర్వహించే పరీక్షలను చూస్తే ప్రభుత్వాసుపత్రుల పరువు నానాటికీ ఎందుకు దిగజారుతుందో అర్థమవుతుంది. సిబ్బంది చేయాల్సిన పరీక్షలను, ఆసుపత్రికి వచ్చే మహిళల చేతనే చేయిస్తున్నారు. ఎదురు సమాధానం చెప్పలేక.. మహిళలు, గర్భిణిలు ఓపీ ముందే యూరిన్‌ పరీక్షలు సొంతంగా చేసుకుంటున్న దృశ్యాలు ఇక్కడ నిత్యకృత్యం. ఇదేమిటని ఎవరైనా ల్యాబ్‌ సిబ్బందిని ప్రశ్నిస్తే చీవాట్లు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో ఎవరికి వారు పరీక్షలు నిర్వహించుకొని తిరిగి వైద్యులను కలుస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ జగన్నాథ్‌కు చీమ కుట్టినట్లయినా లేకపోవడం గమనార్హం.

బాత్‌రూంలకు తాళాలు
బాత్‌రూం కష్టాలతో బాలింతలు చుక్కలు చూడాల్సి వస్తోంది. పోస్టునేటల్‌ వార్డుకి చెందిన మరుగుదొడ్డికి తాళం వేయడంతో కాలకృత్యాలు తీర్చుకోలేని పరిస్థితి నెలకొంది. అసలే మంచానికి ఇద్దరు, ముగ్గురు ఇరుక్కుంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాత్‌రూంకు తాళం వేయడంతో యాంటీనేటల్‌ వార్డుకు పరుగు తీస్తున్నారు. ఇటీవల ఓ బాలింత కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి కళ్లు తిరిగి పడిపోయింది. స్టాఫ్‌ నర్సులు గమనించి సెక్యూరిటీ సాయంతో వార్డుకు తరలించారు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి మరొకటి ఉంటుందా? అనే చర్చ ఆసుపత్రిలో జరుగుతోంది.

కలెక్టర్‌ గారూ.. చూస్తున్నారా!
నిరుపేద కుటుంబం నుంచి కలెక్టర్‌గా ఎన్నికైన వీరపాండియన్‌ కూడా ఆసుపత్రిలోని వైద్య సేవల విషయంలో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రిలో దిగజారిన వైద్య సేవల విషయమై ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురిస్తోంది. ఇంత జరుగుతున్నా సూపరింటెండెంట్‌కు వత్తాసు పలుకుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది. కనీసం ఆసుపత్రి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం చూస్తే నిరుపేదలకు అందుతున్న వైద్యంపై కలెక్టర్‌కు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది.  

చీదరించుకుంటున్నారు
యూరిన్‌ పరీక్ష కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. తీరా మా కోడలు నర్మదాకి కంటైనర్, స్ట్రిప్‌ ఇచ్చారు. ఇదేమిటని అడిగితే మీరే యూరిన్‌ పట్టుకుని, స్ట్రిప్‌ అందులో అద్ది తీసుకురమ్మన్నారు. మీరు పరీక్ష చేయరా? అని అడిగితే చీదిరించుకున్నారు. గర్భిణీలన్న దయ కూడా లేదు. ప్రభుత్వాసుపత్రిలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా?– లక్ష్మిదేవి, నాల్గవ రోడ్డు, అనంతపురం

మరిన్ని వార్తలు