మహిళా సాధికారతే లక్ష్యం

5 Jul, 2015 01:32 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :తండ్రి అనారోగ్యం... తల్లి రాజకీయ పోరాటం.... దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిన వాతావరణం ఆమెను ఐఎఎస్‌వైపు నడిపించింది. అయినా పల్లె వాసనే. భారత్ అన్ని రంగాల్లోనూ అగ్రపథాన దూసుకుపోతున్నా.. ఇంకా ఎక్కడో వెలితి. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. అయినా కూడు, గూడు, గుడ్డ, రోడ్లు, నీటి ఇబ్బందులు.. ఇవన్నీ ఆమెపై ప్రభావం చూపాయి. మహిళా సాధికారితపై దృష్టిసారించాయి. తల్లిని ఢిల్లీ లోక్‌సభలో చూడాలన్న థ్యేయం. పదిమందికీ సాయం చేసి ప్రభుత్వ పథకాల్ని ఇంటింటికీ తీసుకువెళ్లాలన్న ఆలోచన. దీనికి ఐఏఎస్ ఒక్కటే మార్గంగా కనిపించింది. అందుకే కష్టపడి ఐఏఎస్ సాధించింది రెడ్డి వేదిత.
 
 సిక్కోలుకు వన్నె
 జిల్లాకు చెందిన రెడ్డి నాగభూషణరావు, రెడ్డి శాంతిల ప్రథమ కుమార్తె రెడ్డి వేదిత(చిన్ని)కు సివిల్స్‌లో 71వ ర్యాంకు లభించింది. శనివారం ప్రకటించిన ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో ఆమె ఐఏఎస్ సాధించిందని కుటుంబసభ్యులు సంబరపడిపోయారు. నాగభూషణరావు లోక్‌సభలో ప్రిన్సిపల్ సెక్రటరీగా (ఐఎఎఫ్‌ఎస్)గా వ్యవహరిస్తోంటే.. తల్లి రెడ్డి శాంతి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఆమె తాత పాలవలస రాజశేఖరం జెడ్పీ మాజీ చైర్మన్. కుటుంబమంతా దాదాపు రాజకీయ నేపథ్యం ఉన్నవారే. వేదిత రెడ్డి తన చదువు, లక్ష్యం, కుటుంబ నేపథ్యం.. శనివారం రాత్రి సాక్షితో పంచుకున్నారు.
 
 సమాజానికి మంచి జరగాలి
 శ్రీకాకుళం లాంటి వెనుకబడిన జిల్లాకు అన్ని విధాల మంచి జరగాలి. సమాజానికి మంచి చేయాలన్నదే థ్యేయం. సిక్కోలు ప్రతిభ ఢిల్లీలో వినిపించాలి. అమ్మ రాజకీయాల్లోకి వెళ్తానంటే ప్రోత్సహించా. మంచి జరగాలని దేవుడ్ని వేడుకున్నా. మహిళల గళం లోక్‌సభలో అదీ శ్రీకాకుళం సమస్యలు వినిపించాలని, అమ్మ ద్వారా ఇక్కడి ప్రజలకు న్యాయం జరిగితే చూడాలని కలలు గన్నా. అందుకే 2014 ఎన్నికల్లో అమ్మకు మద్దతుగా ప్రచారం నిర్వహించా. గ్రామాలు తిరిగా. మహిళా సాధికారిత కోసం మాట్లాడా. అప్పుడే వెనుకడిన ప్రాంతాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం కళ్లారా చూశా. ఈ రోజుకూ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఆవేదన కలిగించాయి. ఎప్పటికైనా మార్పు వస్తుందని భావించి సివిల్స్‌వైపే అడుగేశా. సమాజానికి మంచి జరగాలని కోరుకుంటున్నా. ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసుకుని గ్రామాల్లో అభివృద్ధికోసం పాటుపడతా.
 
 అందరికీ కృతజ్ఞతలు
 నాకు అన్ని విధాల సహకరించిన మా కోచింగ్ ఫ్యాకల్టీ, కష్టపడి చదివించిన తల్లిదండ్రులు, వెన్నంటి, వెన్ను తట్టి ప్రోత్సహించిన తాతయ్య, అమ్మమ్మలు.. ఇలా అందరికీ కృతజ్ఞతలు. చదవడం కష్టమేమీ కాదు. థ్యాస ఉంటే అదే వస్తుంది. దీనికి ఇన్ని గంటలు చదవాలి అనేమీ పెట్టుకోలేదు. హిందీ, తెలుగు, ఇంగ్లిష్ భాషలు వచ్చు. కాబట్టి ఎక్కడా నాకు ఇబ్బంది రాలేదు. మొదట ఎంతో టెన్షన్ పడ్డా. తరువాత సులభమే అనిపించింది. ప్లానింగ్ ప్రకారం చదివితే ఎలాంటి గోల్ అయినా సాధించొచ్చు.
 
 భగవంతుడి ఆశీర్వాదమే : రెడ్డి శాంతి
 వేదిత చిన్నప్పటి నుంచీ బాగా చదివేది. నాకు కూడా కొన్ని సందర్భాల్లో ఆదర్శంగా నిలిచింది. మహిళా సాధికారిత కోసం పనిచేయాలంటూ సూచించేది. ఆమెది స్పందించే మనస్తత్వం. భగవంతుడి ఆశీర్వాదమే ఆమెను సివిల్స్‌లో నిలబెట్టింది. గ్రామీణ ప్రాంత రైతులకు సాయం చేయాలని మనసులో కోరుకునేది. పేదల కష్టాల్ని చూసి చలించిపోయేది. ఆమెను ఐఏఎస్‌గా చూడాలని చిన్ననాటి నుంచీ నాకూ కోరిక ఉంది. ప్రభుత్వ పథకాలను సమానంగా అందరికీ చేరాలన్నది ఆమె లక్ష్యం. ఇప్పుడా కోరిక నెరవేరింది. అంతా భగవంతుడి ఆశీర్వాదమే.
 
 సంతోషంగా ఉంది ః నాగభూషణరావు
 వెనుక బడిన  జిల్లాల నుంచి వచ్చినా మేం ఢిల్లీ స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్నాం. మా పిల్లలకూ అలాంటి పేరే రావాలని కోరుకున్నాం. ఏపీకి చివరన ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని ఇంకా చాలా గ్రామాల్లో ఇప్పటికీ కనీసం మౌలిక సదుపాయాలు లేవు. ఎప్పటికైనా సమాజానికి ఏదో ఒకటి చేయాలని వేదిత అంటూండేది. దీనికి ఐఎఎస్ ఒక్కటే మార్గం. ఇప్పుడా కోరిక తీరింది. సంతోషంగా ఉంది.
 

మరిన్ని వార్తలు