రూ. 75 వేలతో అద్భుత కారు

1 Apr, 2018 04:26 IST|Sakshi

బొబ్బిలి రూరల్‌: ఓ పాతకారు ఇంజిన్‌తో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి కేవలం రూ. 75 వేలతో అద్భుతమై కారును రూపొందించారు ఇంజినీరింగ్‌ విద్యార్థులు. విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం కోమటపల్లిలోని తాండ్రపాపారాయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఈ కారును తయారు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ బి.వెంకటరమణ ఆధ్వర్యంలో మెకానికల్‌ హెడ్‌ కృపారావు, వర్క్‌షాపు ఇన్‌చార్జి నర్సింగరావుల పర్యవేక్షణలో జీఎల్‌ కార్తీక్, వి.సురేష్, ఎన్‌ఎస్‌ శ్రీకాంత్, వి.మణికంఠ, బి.హరీష్‌బాబు, వెంకటరమణ తదితరులు ఈ మల్టీ పర్పస్‌ కారును రూపొందించారు.  

ఈ మల్టీపర్పస్‌కారును బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంజనీరింగ్‌ విద్యార్థులు తలచుకుంటే ఎలాంటి అద్భుతాలైనా సాధించగలరన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ విద్యార్థులను, కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. 

కారు ప్రత్యేకతలివీ.. 
- కారుకు ఖర్చు కేవలం రూ. 75 వేలు 
మైలేజీ 50-60 కిలో మీటర్ల వేగంతో 20-23 కి.మీ. నడుస్తుంది. 
డ్రైవర్‌తో కలిపి ఆరుగురు ప్రయాణించవచ్చు. 
అల్ట్రాసోనిక్‌ సెన్సార్ల సహాయంతో నడిచే ఈ కారు ఎదురుగా మీటరు దూరంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా నియంత్రించే వీలుంది. 
మద్యం సేవించి వాహనం నడిపితే కారు కదలదు. ఓనర్‌కు మెసేజ్‌ వెళ్లి వాహనం నిలిచిపోతుంది.  
వాహనాన్ని ఎవరైనా తస్కరిస్తే ఆఫ్‌లైన్‌లో కూడా ఎక్కడ ఉందో కనిపెట్టవచ్చు.

మరిన్ని వార్తలు