ఉపాధి పనులకు 25 శాతం అదనపు కూలీ

2 Mar, 2015 02:58 IST|Sakshi

కొయ్యూరు: ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉపాధి హామీలో పని చేసే కూలీలకు 25 శాతం అదనంగా కూలీ చెల్లించనున్నట్టు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. దీని కోసం రూ.450 కోట్ల అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఏప్రిల్, మేలో 30 శాతం, జూన్‌లో 20 శాతం (సగటున 25 శాతం) అదనంగా చెల్లిస్తామన్నారు. రానున్న ఐదేళ్లలో రాష్ర్టంలో ఐదు కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. అందుకోసం నర్సరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

రైతులు తమకు అవసరమైన మొక్కలను నర్సరీల నుంచి తీసుకె ళ్లవచ్చన్నారు. కొయ్యూరులో ఆదివారం జరిగిన దివంగత మాజీ ఎమ్మెల్యే ఎం.వి.వి.సత్యనారాయణ కుమారులు అశోక్, గౌతమ్‌ల వివాహానికి మంత్రి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం పాడేరు నియోజకవర్గానికి రూ.12 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఈ ఏడాది లక్షా 50 వేల హెక్టార్లలో రైతులకు అవసరమైన మొక్కలు సరఫరా చేస్తామన్నారు. గంధం మొక్కలను కూడా రైతులకు సరఫరా చేస్తామని చెప్పారు. ఇందు కోసం రూ.13 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.  
 
భూగర్భ జలాల పెంపునకు చర్యలు
భూగర్భ జలాలను పెంచేందుకు వీలుగా నీరు- చెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దీన్ని ఐదేళ్ల పాటు కొనసాగిస్తామన్నారు. దీనిలో భాగంగా మొదటి విడతలో జిల్లాలోని 438 చెరువులను రూ.13 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. వాటిని బాగు చేయడం ద్వారా వర్షాకాలంలో నీటిని నిల్వ చేసుకుని భూగర్భ జలాలను పెంచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మణికుమారి, ఎం.వి.ఎస్.ప్రసాద్, ఎంపీపీ లక్ష్మీనారాయణ, కొయ్యూరు ఎంపీపీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు