ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి

21 May, 2019 10:25 IST|Sakshi
టెక్నికల్‌ సిబ్బందికి శిక్షణ ఇస్తున్న జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ 

సాక్షి, ఒంగోలు అర్బన్‌ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 23వ తేదీ జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎటువంటి ఆందోళన చెందకుండా ఆత్మ విశ్వాసంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌చంద్‌ అన్నారు. సోమవారం ప్రకాశం భవనంలోని ఎన్నికల కంట్రోలు రూములో సువిధ పోర్టల్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్స్, కంప్యూటర్‌ ఆపరేటర్స్, టెక్నికల్‌ అసిస్టెంట్స్, సీలింగ్‌ రూము, స్ట్రాంగ్‌ రూముల ఇన్‌చార్జ్‌లకు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణ  నిర్వహించారు.

దీనిపై జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సువిధ పోర్టల్‌లో నమోదు చేసే డేటా తప్పులు లేకుండా చూడాలని అసిస్టెంట్‌ స్టేటిస్టికల్‌ అధికారి, టెక్నికల్‌ అసిస్టెంట్స్‌కు సూచించారు. టెక్నికల్‌ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. సువిధ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ వినియోగించే కంప్యూటర్‌కు యుపిఎస్‌ బ్యాకప్‌ ఉండేలా చూడాలన్నారు. యాంటి వైరస్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని సిద్ధంగా ఉండాలన్నారు. రౌండ్‌ వారీగా వచ్చిన డేటాను ఎక్స్‌ఎల్‌ లో డేటా ఎంటర్‌ చేయాలని, రౌండ్ల వారీగా ఫలితాలు నమోదు చేయాలన్నారు.

ఎన్నికల ఫలితాలకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారి కేంద్ర ఎన్నికల పరిశీలకులు సంతకం చేసినవి మాత్రమే స్కానింగ్‌ చేసి మీడియాకు పంపాలని సూచించారు. సీల్‌ చేసిన కంట్రోల్‌ యూనిట్‌లు స్ట్రాంగ్‌ రూమకు చేర్చాలన్నారు. బ్యాలెట్‌ ఓట్ల కవర్లు తెరవడం, వాటని స్కాన్‌ చేసేవిధానాలను వివరించారు. అధికారులంతా ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ నాగలక్ష్మి, డీఆర్‌ఓ వెంకటసుబ్బయ్య, ప్రత్యేక కలెక్టర్‌ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు