గొడ్డు చాకిరీ.. గొర్రె తోక జీతం

23 Apr, 2018 12:33 IST|Sakshi
మంత్రి యనమల రామకృష్ణుడు క్యాంప్‌ కార్యాలయాన్ని ముట్టడించిన ఆశ కార్యకర్తలు (ఫైల్‌)

కనీస వేతనానికి నోచుకోని ఆశ కార్యకర్తలు

రోజురోజుకూ పెరుగుతున్న పనిభారం

 

కాకినాడ రూరల్‌ : చాలీచాలని వేతనాలతో ఆశ వర్కర్లు నానా అవస్థలు పడుతున్నారు. పనిని బట్టి పారితోషికం అంటూ నియామకాలు చేసుకున్న ప్రభుత్వం, వారికి కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు. వేతనాలు పెంచే అవకాశం లేదని ఇటీవల ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పడంతో వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో మాతాశిశు మరణాలు తగ్గించడం మొదలు, గర్భిణులకు, శిశువులకు టీకాలు, పల్స్‌ పోలియో చుక్కలు, ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలు అయ్యేలా చూడడం తదితర పనుల్లో ప్రభుత్వం వీరి సేవలను ఉపయోగించుకుంటోంది. రూరల్‌ నియోజకవర్గంలో 172 మంది ఆశ వర్కర్లు పని చేస్తున్నారు. 

అన్ని పనులు వీరితోనే..

గ్రామాల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, తదితర  విష జ్వరాలు ప్రబలితే తొలుత వైద్యసేవలు అందించేది ఆశ వర్కర్లే. ఇంటింటికీ వెళ్లి జ్వరపీడితులు ఎంతమంది ఉన్నారనే సమాచారం సేకరిస్తారు. ప్రసవం కేసులు కాకినాడ జీజీహెచ్‌కి రిఫర్‌ చేసి వారి వెనువెంటనే ఉంటూ ప్రసవం పూర్తి అయ్యే వరకు సేవలందిస్తున్నారు.

వేతనం తక్కువ..

వీరికి నెలకు రూ.800 నుంచి రూ.1200కి మించి ఇవ్వడంలేదు. పల్స్‌ పోలియో కార్యక్రమంలో (రోజంతా పనిచేస్తే) రూ.75, గర్భిణిని ఆసుపత్రిలో పరీక్షకు తీసుకువస్తే రూ.60, ప్రభుత్వాసుపత్రిలో పరీక్షకు పంపితే రూ.300, కుటుంబ సంక్షేమ ఆపరేషన్‌ చేయిస్తే రూ.150, బాలింతను పర్యవేక్షిస్తే రూ.20, టీబీ రోగికి ఐదు నెలల పాటు మందులు అందజేస్తే రూ.300, ఇంటింటికి తిరిగి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందిస్తే ప్యాకెట్‌కి రూపాయి చొప్పున అందజేస్తున్నారు.

ఏటా ఆశ కార్యకర్తలకు యూనిఫారం ఇవ్వాల్సి ఉండగా రెండేళ్లుగా ఇవ్వడం లేదు. ఇటీవలే 36 గంటలపాటు ఆందోళన నిర్వహించిన కార్యకర్తలు కాకినాడ రూరల్‌ మండలం తిమ్మాపురంలోని మంత్రి యనమల రామకృష్ణుడు క్యాంప్‌ కార్యాలయాన్ని ముట్టడించారు కూడా.

డిమాండ్లు ఇవీ..

∙కనీస వేతనం అమలు చేయాలి.

∙కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారితోషికాలు పెంచాలి.

∙రూ.ఐదు లక్షల ప్రమాద బీమా అర్హత కల్పించాలి.

∙104 సేవల బకాయిలు చెల్లించాలి.

∙రెండేళ్లుగా ఇవ్వని యూనిఫాంతో పాటు అలవెన్స్‌ చెల్లించాలి.

∙అర్హులైన ఆశలకు ఏఎన్‌ఎం శిక్షణ ఇవ్వాలి.

.ఇప్పటికే శిక్షణ పొందిన వారిని సెకండ్‌ ఏఎన్‌ఎంగా తీసుకోవాలి. 

>
మరిన్ని వార్తలు