ఉపాధి కూలీలకు పనిదినాల పెంపు

14 Mar, 2015 02:37 IST|Sakshi

లబ్ధిపొందనున్న 50 వేల కుటుంబాలు
అదనంగా *45 కోట్ల కేటాయింపు

 
చిత్తూరు (అగ్రికల్చర్) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీల కు ప్రభుత్వం పనిదినాలను పెంచింది. ఇప్పటివరకు ఒక కుటుంబానికి వంద రోజుల పని దినాలు ఉండగా, వాటిని 150 రోజులకు పెంచినట్లు శుక్రవారం జిల్లా డ్వామా కార్యాలయానికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. జిల్లాలో మొత్తం 3.94 లక్షల కుటుంబా లు ఉపాధి పథకం కింద పనిచేస్తున్నా యి. అందులో ఇప్పటి వరకు 35 వేల కుటుంబాలకు వంద రోజుల పనిదినాలను అధికారులు కల్పించారు. మరో 15 వే ల కుటుంబాలు వంద రోజుల పనిదినాలను పూర్తి చేసుకునే దిశలో ఉన్నాయి.

2014-15 సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా 50 వేల కుటుంబాలకు 150 రోజుల పనిదినాలను కల్పిస్తారు. అదనంగా కల్పించే 50 రోజుల పనిదినాలకు గాను ఈ ఏడాదికి రూ. 45 కోట్ల మేరకు నిధులను కూడా ప్రభుత్వం కేటాయించింది. ఇదిలావుండగా ఉపాధి పనులకు విచ్చేసే కూలీలకు ప్రస్తుతం వేసవి దృష్ట్యా చేపట్టే పనుల్లో కొంత మేరకు వెసులుబాటు కూడా కల్పించారు. కూలీలు రోజంతా చేయాల్సిన పనుల్లో కొంత మేరకు చేసినా పూర్తి స్థాయిలో (వంద శాతం) కూలి అందిస్తారని డ్వామా పీడీ రాజశేఖర్‌నాయడు తెలిపారు. ఫిబ్రవరి నెలలో 80 శాతం, మార్చిలో 75 శాతం, ఏప్రిల్,మే నెలల్లో 70 శాతం, జూన్‌లో 80 శాతం పనులను చేసినా కూలీలకు వంద శాతం పని కింద కూలి చెల్లిస్తారని ఆయన చెప్పారు.
 
 

మరిన్ని వార్తలు