రాయలసీమ కరువు నివారణకు ప్రపంచ బ్యాంకు సాయం

22 Feb, 2020 04:57 IST|Sakshi

రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం 

ప్రాథమిక ప్రాజెక్టు నివేదికను పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన

రూ.33,869 కోట్ల అంచనాతో పీపీఆర్‌ను సిద్ధం చేసిన జలవనరుల శాఖ

దీనిపై ప్రపంచ బ్యాంకు ఆమోదముద్ర వేస్తే.. తక్కువ వడ్డీకే రుణం లభ్యతకు అవకాశం

సాక్షి, అమరావతి: కరువుకు నెలవుగా మారిన రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి అవసరమైన ఆర్థిక సహకారం అందించడానికి ప్రపంచ బ్యాంకు సూత్రప్రాయంగా అంగీకరించింది. రాయలసీమ కరువు నివారణ ప్రణాళిక అమలుకు ప్రాజెక్టు ప్రాథమిక నివేదికను(పీపీఆర్‌) తయారుచేసి.. పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రూ.33,869 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన పీపీఆర్‌ను ప్రపంచ బ్యాంకుకు పంపేందుకు జలవనరుల శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ప్రణాళిక అమలుకు ప్రపంచ బ్యాంకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. తక్కువ వడ్డీకే రుణం లభిస్తుంది. ఈ నిధులతో కృష్ణా నదికి వరద వచ్చే 40 రోజుల్లో రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా... కాలువలు, ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచే పనులను యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

నిధుల సమీకరణకు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ 
కృష్ణా, గోదావరి, వంశధార తదితర నదుల వరద జలాలను ఒడిసిపట్టి.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళిక రచించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల పనులను శరవేగంగా పూర్తి చేయడానికి అవసరమైన నిధుల సమీకరణకు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ను(ఎస్పీవీ) ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖను ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు సేకరించి, పనులు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. దాంతో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ సంప్రదింపులు జరుపుతున్నారు.

విధానాలు మార్చుకున్న ప్రపంచ బ్యాంకు
కొత్తగా చేపట్టే సాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంక్‌ రుణాలు ఇచ్చిన దాఖలాలు లేవు. పాత ప్రాజెక్టుల పునరుద్ధరణ.. ఆధునీకరణ.. నీటి యాజమాన్య పద్ధతుల అమలు వంటి పనులకు మాత్రమే రుణాలు మంజూరు చేస్తోంది. కానీ, ప్రభుత్వ వినతి మేరకు ప్రపంచ బ్యాంక్‌ తన విధానాలను మార్చుకోవడానికి అంగీకారం తెలిపింది. రాయలసీమ కరవు నివారణ ప్రణాళిక అమలుకు రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. బ్యాంకు సూచనల మేరకు.. కరువు నివారణ ప్రణాళిక అమలుకు రూ.33,869 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన పీపీఆర్‌ను రాష్ట్ర జలవనరుల శాఖ పంపనుంది. ఆ ప్రణాళికపై బ్యాంకు ఆమోదముద్ర వేస్తే.. దాని అమలుకు అయ్యే వ్యయంలో ఎంత వాటాను రుణం రూపంలో ఇచ్చే ఆంశాన్ని స్పష్టం చేస్తుంది. బ్యాంకు వాటాగా ఇచ్చే రుణానికి.. ప్రభుత్వ వాటాను జత చేసి కరువు నివారణ ప్రణాళికను అమలు చేయాలని జలవనరుల శాఖ నిర్ణయించింది.  

మరిన్ని వార్తలు