ఆరు నెలల తర్వాతే ‘అప్పు’ తేలుస్తాం!

16 Dec, 2017 01:40 IST|Sakshi

ప్రపంచబ్యాంకు యాజమాన్యం నిర్ణయం

సాక్షి, అమరావతి బ్యూరో:  అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చే అంశాన్ని ఆరు నెలల తర్వాతే తేలుస్తామని ప్రపంచబ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల బోర్డు స్పష్టం చేసింది. ముందుగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా సహాయ పునరావాస ప్యాకేజీని అమలు చేయాలని కోరింది. రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణానికి హాని జరగదని, స్థానికుల జీవనోపాధికి విఘాతం కలగదని, ఆహార భద్రతకు ముప్పు రాదని తేలితే... ఆరు నెలల తర్వాత రుణం మంజూరు గురించి నిర్ణయం తీసుకుంటామంది.

ఈ మేరకు ఈ నెల 12న ప్రపంచ బ్యాంకు కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. వాటిని బ్యాంకు వెబ్‌సైట్‌లో ఉంచింది. గడువులోగా స్థానిక రైతులు, కూలీల అభ్యంతరాలకు సీఆర్‌డీఏ సమాధానం ఇచ్చే విధంగా బ్యాంకు నుంచి సహకారం అందిస్తామని, అప్పటికీ ఉపాధికి, పర్యావరణానికి, ఆహారభద్రతకు ముప్పు తొలగిపోలేదని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందితే.. తనిఖీ బృందం నివేదికలో పేర్కొన్న విధంగా అన్ని అంశాల్లో లోతైన దర్యాప్తునకు బ్యాంకు అనుమతి ఇస్తుందని యాజమాన్యం పేర్కొంది.

ఈ హామీతో సంతృప్తి చెందినట్లు తనిఖీ బృందం వెల్లడించింది. లోతైన విచారణ జరగాలని తాము చేసిన సిఫార్సు అమలును ఆరు నెలలపాటు వాయిదా వేసుకుంటున్నామంది. 6 నెలల్లో యథాతథస్థితి కొనసాగితే.. రాజధా ని నిర్మాణం వల్ల పర్యావరణానికి జరుగుతున్న హాని, స్థానికుల జీవనోపాధికి కలుగుతున్న విఘాతం తదితరాలపై విచారణకు బ్యాంకు యాజమాన్యం ఆదేశిస్తుందంది. తనిఖీ విభాగం నివేదికను ప్రపంచ బ్యాంకు పరిగణనలోకి తీసుకోవడంతో రుణం మంజూరు ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది?

మరిన్ని వార్తలు