నిబంధనల మేరకే వ్యవహరిస్తాం

6 Dec, 2017 01:25 IST|Sakshi

రాజధానిపై సామాజిక కార్యకర్తల లేఖకు ప్రపంచబ్యాంకు స్పందన

సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: రైతులను భయపెట్టి తీసుకున్న భూముల్లో నిర్మిస్తున్న రాజధాని వల్ల పర్యావరణానికి పెను ముప్పు ఏర్పడుతుందంటూ  ప్రముఖ సామాజిక కార్యకర్తలు రాసిన లేఖకు ప్రపంచ బ్యాంకు స్పందించింది. రాజధాని నిర్మాణంతో స్థానికులు జీవనోపాధిని కోల్పోతారని, పర్యావరణానికి విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ దేశంలోని 46 మంది ప్రముఖ సామాజిక కార్యకర్తలు, నిపుణులు నవంబర్‌ 27న ప్రపంచబ్యాంకుకు లేఖ రాసిన విషయం విదితమే. లేఖలో పేర్కొన్న అభ్యంతరాలకు ప్రపంచబ్యాంకు స్పందిస్తూ.. రాజధాని నిర్మాణానికి రుణం మంజూరు చేసే విషయంలో నిబంధనల మేరకు వ్యవహరిస్తామని సమాచారం ఇచ్చింది.

సెప్టెంబర్‌లో ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం రాజధానిలో పర్యటించి రూపొందించిన నివేదికను  వెబ్‌సైట్‌లో పెట్టి ఆ తర్వాత తొలగించడం పట్ల సామాజిక కార్యకర్తలు లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ తనిఖీ బృందం నివేదికను పరిశీలిస్తున్నామని, ఈ నెల 12న బ్యాంకు వెబ్‌సైట్‌లో దానిని అప్‌లోడ్‌ చేస్తామని ప్రపంచబ్యాంకు తెలిపింది. సామాజిక కార్యకర్తలు లేవనెత్తిన ప్రతి అంశాన్ని పరిశీలిస్తామని, రైతుల అభ్యంతరాలను ప్రభుత్వం పరిష్కరించిన తర్వాతే రుణ మంజూరు విషయంలో తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. సామాజిక కార్యకర్తలు లేవనెత్తిన అంశాలను పరిశీలించడానికి వీలుగా ఒక కమిటీ ఏర్పాటు చేసే యోచనలో ప్రపంచ బ్యాంకు ఉన్నట్లు సమాచారం. ప్రతిపాదిత కమిటీలో వివిధ రంగాల నిపుణులను నియమిస్తారని తెలిసింది.   

మరిన్ని వార్తలు