ఎరుపెక్కిన విశాఖ

2 May, 2015 05:14 IST|Sakshi

- వాడవాడల మేడే వేడుకలు
- భారీ ర్యాలీలు, బహిరంగ సభలు
- ఆకట్టుకున్న సీపీఎం బొమ్మల ప్రదర్శన
విశాఖపట్నం(డాబాగార్డెన్స్):
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని నగరంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పలు కూడళ్లు, వీధుల్లో ఎర్రజెండాల తోరణాలు కట్టడడంతో అంతా ఎరుపుమయంగా కనిపించింది. దుకాణాలకు సెలవు దినం కావడంతో మేడే ర్యాలీల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. వాడవాడలా ఎర్ర జెండాలు ఎగురవేశారు. పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. కార్మికుల పట్ల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. కార్మికులకు సంకెళ్లు-కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్లా, ఆమ్ ఆద్మీ, కార్మికుడు-రైతు బొమ్మలతో సీపీఎం పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించింది. మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు..నిర్భయ చట్టం ఎక్కడా? అంటూ ప్రదర్శించిన బొమ్మలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

కేజీహెచ్‌లో: ఆంధ్రమెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సంయుక్తంగా కేజీహెచ్‌లో మేడే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదనరావు జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా శ్రమించి కేజీహెచ్‌ను అభివృద్ధిబాటలో నడిపిద్దామని కార్మికులకు పిలుపునిచ్చారు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు జె.వి.సత్యనారాయణమూ ర్తి మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను నరేంద్రమోదీ ప్రభుత్వం అవలంభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఉదయ్‌కుమార్, ఆర్‌ఎంవో బంగారయ్య, ఎంప్లాయీస్ యూని యన్ అధ్యక్షుడు వై.త్రినాథ్, కార్యదర్శి టి.నాగరాజు, జె.డి.నాయుడు కార్మికులు పాల్గొన్నారు.

సీపీఎం ఆధ్వర్యంలో...
కార్మిక చట్టాలపై బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల దాడిని తిప్పికొట్టాలని సీపీఎం గ్రేటర్ విశాఖ నగర కమిటీ నేతలు పిలుపునిచ్చారు. నగరంలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. యల్లమ్మతోట నండూరి ప్రసాదరావు భవన్ నుంచి ప్రారంభమైన  ర్యాలీ జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్ల కార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎ త్తున సీపీఎం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

డాల్ఫిన్ హోటల్స్ యూనియన్ ఆధ్వర్యంలో...
డాల్ఫిన్ హోటల్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్మిక దినోత్సవాన్ని నిర్వహించింది. హోటల్ ముందు యూనియన్ జెండాను గౌరవాధ్యక్షుడు వై.రాజు ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల పైబడి హోటల్లో పని చేస్తున్న సీనియర్ స్టాఫ్‌కు ఇప్పటికీ రూ.10 వేల జీతం కూడా అందకపోవడం దారుణమన్నారు. జీతం పెంచకపోగా గెస్ట్‌ల నుంచి వసూలు చేసిన సర్వీసు చార్జీలో ప్రతి నెలా యాజమాన్యం లక్షలాది రూపాయలు దిగమింగుతోందని ఆరోపించారు. 8 గంటల పనిదినం సక్రమంగా అమలు జరగడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు కె.అప్పలనాయుడు, ఉపాధ్యక్షుడు సిహెచ్.పాపారావు, కోశాధికారి ఎన్.కుమారస్వామి, సభ్యులు జి.ఆనంద్, బి.శ్రీనివాస్, టి.కృష్ణ, టి.సోమినాయుడు, సన్యాసిరావు పాల్గొన్నారు.

వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఆధ్వర్యంలో..
మే డేను పురస్కరించుకొని ఏపీ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డు ఆంజనేయస్వామి గుడి వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ తెడ్డు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ ప్రణాళికలో 8 జోనల్ పెండింగ్ కమిటీలను ఒకటిగా ఏర్పాటు చేసి ప్రతి వీధి విక్రయదారునికి న్యాయం జరిగేలా చూడాలన్నారు.  

ఆటోరిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో..
జిల్లా ఆటోరిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రీన్‌పార్కు హోటల్ ఎదుట ఉన్న ఆటోస్టాండ్ వద్ద మే డేను ఘనంగా నిర్వహించారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.కె.రెహ్మాన్ మే డే జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆటో కార్మికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు