'సాంస్కృతిక దాడి మరీ ప్రమాదకరం'

17 Oct, 2015 19:54 IST|Sakshi

మలికిపురం (తూర్పుగోదావరి) : భౌతిక దాడుల కంటే సాంస్కృతిక దాడులు అత్యంత ప్రమాదకరమైనవని ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శివారెడ్డి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. రికార్డు సృష్టించే లక్ష్యంతో 30 గంటల 30 నిమిషాల 30 సెకన్ల పాటు నిర్వహిస్తున్న ఈ ఉత్సవంలో శనివారం నాటికి 1620 మంది కవులు పేర్లు నమోదు చేయించుకున్నారు. కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శివారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో సాంస్కృతిక దాడులు ఎక్కువయ్యాయని తెలిపారు. శత్రువు ఎక్కడో లేడని.. టీవీలు, సెల్ ఫోన్‌ల రూపంలో మనింట్లోనే ఉన్నాడని పేర్కొన్నారు.

కుటుంబ సభ్యులు ఒకే చోట కూర్చొని మాట్లాడుకునే పూర్వ సంప్రదాయం ఇప్పుడు కనుమరుగైందని, విడాకుల సంస్కృతి పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కవులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మాటలు చలి వల్ల చావలేవని, ధైర్యం లేకనే చనిపోతాయని ఒక హిందీ రచయిత చెప్పిన మాటలు కవులు గుర్తుంచుకోవాలన్నారు. రచయితలకు హద్దులు ఉండకూడదని, రాసేవారు కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచి రచనలు వస్తాయన్నారు. కొత్త తరాలను రచనా రంగంలోనికి ఆహ్వానించకుంటే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఏర్పడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. రచయిత కత్తిమండ ప్రతాప్, కలిదిండి వర్మ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల 30 సెకన్ల వరకూ జరుగుతుంది.

మరిన్ని వార్తలు