ముక్కిపోతున్నాయ్‌!

16 Mar, 2018 11:15 IST|Sakshi
రాజాంలోని ఓ మిల్లువద్ద నిల్వగా ఉండిపోయిన బియ్యం బస్తాలు

సర్కారు బియ్యానికి పురుగులు

మిల్లర్ల వద్ద మూలుగుతున్న బియ్యం, ధాన్యం

మురిగిపోతున్న 4.50 లక్షల టన్నుల బియ్యం

మరో 3000 టన్నుల ధాన్యం నిల్వ

రాజాం:ప్రభుత్వ బియ్యానికి పురుగులు పడుతున్నాయి. ఒకటి కాదు రెండు ఏకంగా లక్షల బియ్యం ముక్కిమూలుగుతోంది. అటు అధికారులు, ఇటు పాలకులకు కూడా పట్టించుకోకపోవడంతో సమస్య తీవ్రంగా మారుతోంది. తమ వద్ద ఉన్న బియ్యాన్ని అధికారులు తీసుకెళ్లకపోవడంతో బియ్యం పాడవుతుండగా, ఆడాల్సిన ధాన్యం కూడా మిల్లర్ల వద్ద ఆరుబయట ఉండిపోయి పాడయ్యే దుస్థితి.

ప్రభుత్వ లెక్కలు ఇవే
వాస్తవంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ 2.35 లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లర్ల వద్ద నుంచి సేకరించినట్లు రికార్డులు చెబుతున్నాయి. మిగిలిన వాటిలో కేవలం 2.95 లక్షల టన్నుల బియ్యం మాత్రమే నిల్వ ఉందని అంచనాలు చెబుతున్నాయి. వాస్తవంగా ఇవి 4.50 లక్షలు టన్నులు దాటి ఉంది. అయితే ఇవి గోదాంలు లేక, కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేక నిల్వఉండిపోయాయి. వీటిని అటు అధికారులతో పాటు ఇటు పాలకులు పట్టించుకోకపోవడం శోచనీయం.

భద్రపరిచే బాధ్యత మిల్లర్లదే
జిల్లావ్యాప్తంగా పలు చోట్ల ధాన్యం మిల్లుల వద్ద బియ్యం నిల్వలు ఉన్న విషయం వాస్తవమే. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్ర ప్రభుత్వ విభాగంలో 2.35 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మరో 2.95 లక్షలు టన్నుల  బియ్యాన్ని తీసుకోవా లి. ఇవి తీసుకునే వరకూ వీటిని జాగ్రత్త పరిచే బాధ్యత మిల్లర్లదే.
–ఎస్‌.వెంకటేశ్వరరావు,సివిల్‌ సప్లయ్‌ డీఎం, శ్రీకాకుళం

జిల్లాలో 4.50 లక్షల టన్నులు
జిల్లావ్యాప్తంగా గత ఏడాది నవంబర్‌లో 302కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. వీటికి సంబంధించి 300 రైస్‌ మిల్లులో ధాన్యాన్ని సేకరించే కేంద్రాలు ఏర్పాటు చేశారు. సివిల్‌ సప్లయ్‌ కస్టమ్స్‌ మిల్లులుగా కేటాయించి కేవలం ధాన్యం తీసుకుని బియ్యాన్ని అందించే పని అప్పగించారు. ఒక క్వింటా ధాన్యానికి 65 కిలోల బియ్యాన్ని అందించాల్సి ఉంది. ఇలా అందించేందుకు ఒక్కో క్వింటాకు రూ.15 ప్రభుత్వం మిల్లరుకు అందిస్తుంది. ఇందులో రూ.2.50 జీఎస్టీ రూపంలో కట్‌ చేస్తారు. ఇప్పుడు ఈ మిల్లర్లుకు కొత్త సమస్య వచ్చింది. మిల్లులకు ధాన్యాన్ని అప్పగించిన ప్రభుత్వం.. బియ్యాన్ని తీసుకోవడంలేదు. మూడు నెలలుగా జిల్లా వ్యాప్తంగా 4.50 లక్షల టన్నుల బియ్యం మిల్లర్ల వద్ద ఉండిపోయింది.

పురుగులు పడుతున్న బియ్యం
మూడు నెలలుగా మిల్లర్ల వద్ద బియ్యం ఉండిపోవడంతో వీటికి పురుగులు పడుతోంది. ఎక్కడికక్కడే బియ్యం నిల్వలు మిల్లర్లు వద్ద పేరుకుపోయాయి. మిల్లర్ల వద్ద నుంచి ప్రభుత్వం బియ్యాన్ని తీసుకోకపోవడంతో పాటు మిల్లర్ల వద్ద భద్రపరిచేందుకు టార్పాలిన్లు కూడా ఇవ్వలేదు. ఫలితంగా బియ్యం పాడవుతోంది. తెల్లని నులిపురుగులతో పాటు నల్లని సుంకు పురుగులు పడుతున్నాయి. పలు మిల్లర్ల వద్ద 6 నుంచి పది వేల క్వింటాళ్ల వరకూ ధాన్యం నిల్వలు ఉండిపోయాయి. వీటిని నిల్వచేసేందుకు మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా అనుకున్న లెక్క ప్రకారం ప్రభుత్వానికి ఇవి ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో మిల్లరు నష్టపోయే పరిస్థితి దాపురించింది.

మరిన్ని వార్తలు