అర్ధరాత్రి ఘోరం

4 Mar, 2017 14:09 IST|Sakshi
అర్ధరాత్రి ఘోరం

► అదుపుతప్పి వ్యవసాయబావిలోకి దూసుకెళ్లిన టవేరా
► ఇద్దరు మృతి, అయిదుగురికి తీవ్ర గాయాలు
► శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన
► తిరుపతి సమీపంలోని పెరుమాళ్లపల్లెలో ప్రమాదం
► బాధితులందరూ ఒకే కుటుంబానికి చెందిన తమిళనాడు వాసులు
► క్షతగాత్రులను రుయాకు తరలించిన పోలీసులు


తిరుపతి క్రైం: శుక్రవారం అర్ధరాత్రి 12.15 గంటల ప్రాంతంలో.. తిరుపతి ఎమ్మార్‌ పల్లె సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టవేరా వాహనం అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. దాదాపు 150 మీటర్ల వరకు రోడ్డు పక్కకు వెళ్లింది. అనంతరం సుబ్రమణ్యంరెడ్డి అనే రైతుకు చెందిన వ్యవసాయ బావిలో పడిపోయింది. దాదాపు 75 అడుగుల లోతులో వాహనం ఇరుక్కు పోయింది.

పోలీసులు అందించిన వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లా చెంగం గ్రామానికి చెందిన షణ్ముగం, విజయ్, శివ, సరసు, సుకన్య, షకీలతో పాటు డ్రైవర్‌ తిరుమల శ్రీవారి దర్శనానికి గురువారం వచ్చారు. శుక్రవారం తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయాన్ని దర్శించారు. అనంతరం స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో తిరుపతి ఎమ్మార్‌పల్లె పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పెరుమాళ్లపల్లె పంచాయతీ ఆంజనేయస్వామి గుడి ఎదురుగా వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు సుకన్య అనే మహిళ మృతి చెందింది. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో పోలీసుల, ఫైర్‌ సిబ్బంది క్షతగాత్రులను బావిలో నుంచి రక్షించి రుయా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో క్షతగాత్రుల రోదనలు మిన్నంటాయి.

శబ్ధం విని ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు
టవేరా వాహనం వ్యవసాయ బావిలో పడడంతో భారీశబ్ధం వచ్చింది. దీంతో స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి. 108కు, పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్‌ సిబ్బంది, 108 సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు