స్వైన్‌ ఫ్లూ భయంతో గ్రామం వెలి!

9 Dec, 2018 04:30 IST|Sakshi
చింతకోళ్లలో గ్రామస్థులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు

కృష్ణా జిల్లా కోడూరు మండలంలో దారుణం

మూడు రోజుల కిందట చింతకోళ్ల గ్రామంలో ఫ్లూతో వ్యక్తి మృతి

గ్రామస్తులకూ వైరస్‌ ఉందంటూ ప్రచారం

ఆ ఊరి ప్రజలతో మాట్లాడని సమీప గ్రామాల ప్రజలు

పాలు పోయడానికీ నిరాకరణ.. ఆటోలలో కూడా ఎక్కించుకోని వైనం

గ్రామ విద్యార్థులకు సెలవులు ప్రకటించిన పలు ప్రైవేటు విద్యాసంస్థలు

వెలివేసినట్లు చూస్తున్నారని చింతకోళ్ల వాసుల ఆవేదన

రక్త పరీక్షలు చేసి ఎలాంటి జ్వరాలు లేవని అధికారుల నిర్ధారణ

వివక్ష చూపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న తహసీల్దార్‌ 

కోడూరు(అవనిగడ్డ): విజ్ఞానం పెరిగే కొద్దీ మనుషుల మధ్య దూరం పెరుగుతోందనేందుకు కృష్ణా జిల్లాలో జరిగిన ఓ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. స్వైన్‌ ఫ్లూ భయంతో కోడూరు మండలం మందపాకల శివారు చింతకోళ్ల గ్రామాన్ని సమీప గ్రామాల ప్రజలు వెలివేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 5వ తేదీన చింతకోళ్ల గ్రామానికి చెందిన పేరే నాంచారయ్య స్వైన్‌ఫ్లూతో మృతిచెందారు. దీంతో నాంచారయ్యతో పాటు మిగిలిన గ్రామస్తులకు కూడా ఆ వైరస్‌ ఉందని, వీరు తమతో పాటు కలిస్తే ఆ వ్యాధి తమకు కూడా సోకుతుందంటూ ఆ ఊరి ప్రజలతో శివారు గ్రామస్తులు మాట్లాడడం కూడా మానేశారు. పాలు కూడా పోయడం లేదు. అలాగే మండల కేంద్రంలోని పలు ప్రైవేటు విద్యాసంస్థలు చింతకోళ్ల గ్రామం నుంచి వచ్చే చిన్నారులకు సెలవులు ప్రకటించాయి. తాము చెప్పేవరకు విద్యార్థులను పాఠశాలలకు పంపవద్దని పలు యాజమాన్యాలు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం. దీంతో పాటు స్కూల్‌ బస్సులను కూడా ఆ గ్రామానికి నిలిపివేశారు. గ్రామ ప్రజలను ఆటోవాలాలు తమ ఆటోల్లో ఎక్కించుకోకుండా దూరం పెడుతున్నట్లు చింతకోళ్లవాసులు వాపోతున్నారు. ఒకవేళ చింతకోళ్ల నుంచి ఆటో వస్తే ఆ ఆటో ఎవరు ఎక్కకుండా ఖాళీగా పంపించేస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇక చింతకోళ్లకు బంధుత్వం ఎక్కువగా ఉన్న సమీప గ్రామాల్లో అయితే ఏకంగా ‘చింతకోళ్లకు వెళ్లవద్దు.. ఆ గ్రామస్తులను మన గ్రామంలోకి రానివద్దు అంటూ మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆ గ్రామ ప్రజలు కనీస అవసరాలు తీరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎవరికీ జ్వరాలు లేవు
స్వైన్‌ఫ్లూ మరణంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చింతకోళ్ల గ్రామంలో నాలుగు రోజుల నుంచి ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి గ్రామస్తులందరికి వైద్యపరీక్షలు చేస్తున్నారు. మృతుడికి మినహా మిలిగిన ఎవరికీ జ్వరాలు లేవని, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తేల్చారు. తమకు ఏవిధమైన వైరస్‌ సోకకపోయినా మిగిలిన గ్రామస్తులు తమను దూరం పెడుతున్నారని, తమతో మాట్లాడడం లేదని, నిత్యావసరాల కోసం వెళ్తే ఎవరూ స్పందించం లేదని చింతకోళ్లవాసులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి తమ గ్రామంలో ఏవిధమైన వైరస్‌ లేదంటూ చుట్టు పక్కల గ్రామాల్లో తెలియజెప్పాలని వారు వేడుకుంటున్నారు.

వెలివేసినట్లు చూస్తున్నారు 
మా గ్రామంలో ఒక వ్యక్తి స్వైన్‌ఫ్లూతో మరణించడంతో గ్రామమంతా ఈ వైరస్‌ ఉందంటూ తమను చుట్టు పక్కలవారు వెలివేసినట్లుగా చూస్తున్నారు. పక్క గ్రామాల నుంచి వచ్చే పాల సరఫరాను కూడా నిలిపివేశారు. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు మా గ్రామం నుంచి విద్యార్థులను పాఠశాలలకు రావద్దంటూ సెలవులు ప్రకటించాయి. ఇలా ప్రతి విషయంలో మాముల్ని దూరం పెడడంతో గ్రామస్తులంతా తీవ్ర మనోవేదన చెందుతున్నాం. 
– సుబ్రహ్మణ్యం, చింతకోళ్ల గ్రామస్తుడు

అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు 
చింతకోళ్ల గ్రామంలో స్వైన్‌ఫ్లూ వైరస్‌ ఉందంటూ మిగిలిన గ్రామాల ప్రజలు చేపట్టిన అసత్య ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దు. వైద్యాధికారులు నాలుగు రోజుల నుంచి ఇక్కడ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అందరికి రక్తపరీక్షలు కూడా చేశారు. గ్రామస్తులకు జ్వరాలు లేవని తేల్చారు. చింతకోళ్లవాసులపై వివక్షత చూపినవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. 
– కె.ఎ.నారాయణరెడ్డి, తహసీల్దార్‌

మరిన్ని వార్తలు