ఆ రకంగా..సైకిల్

3 Mar, 2014 02:20 IST|Sakshi
ఆ రకంగా..సైకిల్
  • టీడీపీ పరిస్థితి దయనీయం
  •      రెండేళ్ల క్రితమే సగానికి పైగా ఖాళీ
  •      తాజాగా ఎన్నికల తరుణంలో గులాబీ గూటికి...
  •      నేడు టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్యే సత్యవతి
  •      మారనున్న డోర్నకల్  రాజకీయం
  •  సాక్షి ప్రతినిధి, వరంగల్: టీడీపీ పరిస్థితి జిల్లాలో దయనీయంగా మారింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీడీపీ పుంజుకుంటుందని... తమకు ఇక ఎదురులేదని పార్టీ నాయకులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు మొదలై వారం కాకముందే... తెలుగుదేశం పార్టీకి జిల్లాలో పెద్ద దెబ్బ తగిలింది. ఏకంగా ఒక ఎమ్మెల్యే పార్టీకి గుడ్‌బై చెప్పారు. డోర్నకల్ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత సత్యవతి రాథోడ్ టీడీపీకి ఆదివారం రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు సమక్షంలో హైదరాబాద్‌లో సోమవారం గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రకటించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోపు టీడీపీ నుంచి తమ పార్టీలోకి వలసల పరంపర ఇదేవిధంగా కొనసాగుతుందని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంకెవరెవరు క్యూలో ఉన్నారనే అంశం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
     
    రెండేళ్ల క్రితమే...
     
    తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతం, విశ్వసనీయత లేని విధానాలతో జిల్లాలోని టీడీపీకి చెందిన కీలక నేతలు ఇతర పార్టీల్లోకి గతంలోనే వెళ్లిపోయారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు వారితో కలిసి ద్వితీయశ్రేణి నాయకులు టీఆర్‌ఎస్‌లోనే చేరారు. దీంతో రెండేళ్ల క్రితమే పార్టీ దాదాపు సగానికిపైగా ఖాళీ అయింది. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం తర్వాత నేతలు పార్టీని వీడడం పెరుగుతోంది. టీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత జిల్లాలో మొదటిసారి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెలే పార్టీని వీడారు. రాజకీయ భవిష్యత్‌పై ఆందోళనతో టీడీపీకి చెందిన మిగిలిన ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఇప్పుడు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.
     
    వేగంగా డీలా...
     
    ప్రజావ్యతిరేకతతో పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న టీడీపీని... తెలంగాణపై చంద్రబాబు అనుసరించిన అస్పష్ట వైఖరి జిల్లాలో బాగా దెబ్బతీసింది. 2009 ఎన్నికల్లో పర్వాలేదనిపించేలా ఫలితాలు వచ్చినా... తర్వాత పరిణామాలతో క్రమంగా పార్టీ ఖాళీ అవుతోంది. 2009 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్న టీడీపీ జిల్లాలో నర్సంపేట, పాలకుర్తి, ములుగు, డోర్నకల్ స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ తీవ్రతతో రాజకీయాలు మారిపోయాయి. టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు భారీగా టీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి టీడీపీని వీడిన సందర్భంలో టీడీపీ భారీగా నష్టం జరిగింది. తాజాగా సాధారణ ఎన్నికల తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీని వీడుతుండడంతో టీడీపీలో నైరాశ్యం నెలకొంది.
     
    మారిన రాజకీయం..
     
    సత్యవతి రాథోడ్ 1985 నుంచి టీడీపీలో ఉన్నారు. 1989లో డోర్నకల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 1995లో కురవి జెడ్పీటీసీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అదే ఏడాది గుండ్రాతిమడుగు సర్పంచ్‌గా గెలిచారు. 2001లో చింతపల్లి ఎంపీటీసీగా ఓడిపోయారు. 2006లో నర్సింహులపేట జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందారు. 2009లో టీఆర్‌ఎస్ మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల తరుణంలో ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం... లేదా... రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే డోర్నకల్ అసెంబ్లీ సీటు మాజీ మంత్రి రెడ్యానాయక్‌కు దక్కుతుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇప్పుడు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఇక్కడ రాజకీయం మారుతోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ విలీనం... పొత్తు.. ఏది జరిగినా రెడ్యానాయక్ పోటీ విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
     

>
మరిన్ని వార్తలు