ఇసుక ధరలను అదుపు చేస్తాం

24 Nov, 2014 01:44 IST|Sakshi
ఇసుక ధరలను అదుపు చేస్తాం

సాక్షి, గుంటూరు: ఇసుక ధరలను అదుపు చేస్తామని, ఇందులోభాగంగా ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. నూతన ఇసుక విధానం అమలుపై జిల్లా అధికారులతో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 15.49 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందన్నారు.

ఇసుక విధానాన్ని సక్రమంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అర్బన్, రూరల్ ఎస్పీలు, జేసీ, జిల్లా పంచాయతీ అధికారి, డీఆర్‌డీఏ పీడీ, డ్వామా పీడీ, డీటీసీలతో కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ధరల నియంత్రణ, అక్రమ తరలింపులపై ఈ కమిటీ రెండు రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తుందన్నారు.

రవాణా చార్జీలపై పర్యవేక్షణకు డీటీసీ, అదనపు ఎస్పీ, ఏజేసీలతో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. అవకతవకల నివారణకు అర్బన్, రూరల్ ఎస్పీల నేతృత్వంలో విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ పనిచేస్తుందన్నా రు. రవాణాలో ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వమే వాహనాలు కొనుగోలు చేస్తుందన్నారు.

 రూ.5.34 కోట్ల విలువైన ఇసుక విక్రయం
 జిల్లాలో ఐదు రీచ్‌ల ద్వారా ఇప్పటివరకు రూ.5.34 కోట్ల విలువైన 2,467 క్యూబిక్ మీటర్ల ఇసుకను విక్రయించినట్లు మంత్రి చెప్పారు. క్యూబిక్ మీటర్ ఇసుకను రూ.650 కే విక్రయించామన్నారు. ఓగేరు, గుండ్లకమ్మ వంటి గుర్తింపు లేని రీచ్‌లలో పంచాయతీ కార్యదర్శుల అనుమతితో ఇసుక కొనుగోలు చేయవచ్చన్నారు.

ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శి అక్రమాలకు పాల్పడితే తక్షణమే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అక్రమాలపై 18001212020 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే తక్షణమే పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. సమావేశంలో కలెక్టర్ కాంతిలాల్ దండే, అర్బన్, రూరల్ ఎస్పీలు రాజేష్‌కుమార్, రామకృష్ణ, జేసీ డాక్టర్ శ్రీధర్, డీపీవో వీరయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు