తమ్ముళ్లు గుర్రు

14 Jun, 2014 00:41 IST|Sakshi
  •      చంద్రబాబు తీరుపై ఆగ్రహం
  •      ఎన్నికల ముందు పదవుల ఎరతో బుజ్జగింపులు
  •      ఇప్పుడు మొహం చాటు
  •      నామినేటెడ్ పదవులపై దాటవేత
  • సాక్షి, విశాఖపట్నం :  ఏరుదాటాక తెప్ప తగలేయడం అంటే ఇదేనేమో... ఎన్నికల ముందు పదవుల ఎర చూపి తమ్ముళ్లను బుజ్జగించిన టీడీపీ అధినేత చంద్రబాబు గెలిచిన తరువాత వారికి మొహం చాటేస్తున్నారు. బాబు నిజస్వరూపాన్ని తెలియని కొందరు తమ్ముళ్లు ఆయన వద్దకు వెళ్లి నగుబాటుకు గురయ్యారు. ఎన్నో ఆశలతో వెళ్తే కనీసం పలకరించకుండా మొహం చాటేయడంతో నిప్పులు కక్కుతున్నారు.

    అధికారంలోకి వచ్చిన తరువాత తమ నేత తీరును చూసి నోరెళ్లబెడుతున్నారు. ఇప్పుడు చేసేది లేక భవిష్యత్తుపై బెంగపెట్టుకున్నారు. విశాఖలో కేబినేట్ సమావేశానికి హాజరైన చంద్రబాబును అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని, బుజ్జగింపులతో దారికి వచ్చిన టీడీపీ నేతలు కొందరు కలిసే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వచ్చాక ఏదోక నామినేటెడ్ పోస్టు ఇస్తానని స్వయంగా బాబు హామీ ఇవ్వడంతో కొందరు ఎయిర్‌పోర్టులోను, ఇంకొందరు ఏయూలో కలిసి విన్నవించారు. బాబు మాత్రం వారికి స్పష్టమైన హామీ ఇవ్వలేదు.
     
    యలమంచిలి టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న సుందరపు విజయ్‌కుమార్ టిక్కెట్ లభించకపోవడంతో ఆమరణ దీక్ష చేపట్టారు. చివరకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి ఏదొక పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. తనకు ఎమ్మెల్సీ అయినా దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. గురువారం ఆయన బాబును కలవగా నామినేటెడ్ పదవులు ఏం లేవని, ఒకవేళ ఉంటే సెప్టెంబరులో చూద్దామని చెప్పినట్టు తెలిసింది.

    పాడేరుకు చెందిన మాజీ మంత్రి మణికుమారి సైతం బాబును కలిసి అధిష్టానంపై నమ్మకంతో ఎన్నికల బరి నుంచి తప్పుకున్నందును ఏదొక పదవి ఇవ్వాలని కోరారు. గిరిజన కార్పొరేషన్, ఇతర సంస్థల్లో నామినేటెడ్ పోస్టు ఆశిస్తున్న ఈమెకు కూడా ఎలాంటి హామీ లభించలేదు.
     
    గాజువాక నియోజకవర్గం నుంచి టీడీపీ రెబల్‌గా బరిలో దిగాలని భావించినా అధినేత బుజ్జగింపుతో వెనుకంజ వేసి న కోన తాతారావు జీవీఎంసీ మేయర్ లేదా వుడా చైర్మన్ పోస్టు ఆశిస్తున్నారు. అతడు మంత్రి అయ్యన్న అనుచరుడు కావడంతో కలిసివచ్చినట్టుంది. మేయర్ పదవి ఇచ్చేందుకు బాబు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
     
    మాజీ మంత్రి అప్పలనరసింహరాజు భీమిలి అసెంబ్లీ టికెట్ తన కుమారుడి కోసం ప్రయత్నించి విరమించుకున్నారు. అక్కడ అభ్యర్థి గంటాకు పూర్తిగా సహకరించారు. ఇప్పుడు ఈయన ఏదొక పదవి ఆశిస్తున్నారు. బాబును కలిస్తే సరైన సమాధానం రాలేదు.
     
    పప్పల చలపతిరావు ఎమ్మెల్సీ లేదా పేరున్న నామినేటెడ్ పోస్టు కావాలని కోరుతున్నారు.
     వీరెవరికి బాబు హామీ ఇవ్వలేదు. సరికదా సరిగా స్పం దించలేదని తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేలు జరుగుతుందనుకుంటే, ఇప్పుడు పదవి వస్తుందో రాదో తెలియని పరిస్థితి. నెలకొందని మధనపడుతున్నారు.
     

>
మరిన్ని వార్తలు