-

నేడు లేదా రేపు ‘సచివాలయ’ ఫలితాలు

19 Sep, 2019 04:36 IST|Sakshi

సాక్షి, అమరావతి: లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు గురువారం సాయంత్రం లేదా శుక్రవారం విడుదల కానున్నాయి. గురువారమే ఫలితాలు వెల్లడించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే.. ప్రభుత్వంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్నవారికి వెయిటేజ్‌ మార్కులు కలిపే అంశానికి సంబంధించి ఇంకా రెండు శాఖల నుంచి సమాచారం అందలేదు.

భర్తీ చేస్తున్న మొత్తం 19 రకాల ఉద్యోగాల్లో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్‌–5, రూరల్‌ వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ, వీఆర్వో, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, సెరికల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టులు మినహా మిగిలిన పోస్టులకు ప్రస్తుతం ఆయా ఉద్యోగాల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్నవారికి వారి సర్వీస్‌ కాలం ఆధారంగా వెయిటేజ్‌ మార్కులు ఉంటాయని అధికారులు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే.. అందులో రెండు రకాల ఉద్యోగాల రాతపరీక్షల ఫలితాలకు వెయిటేజ్‌ మార్కులు కలిపే ప్రక్రియ బుధవారం సాయంత్రం వరకు పూర్తికాలేదు. దీంతో గురువారం ఉదయానికి ఈ ప్రక్రియ పూర్తయితే, సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదగా ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

ఇన్‌చార్జి మంత్రులతో గ్రామ సచివాలయాలు ప్రారంభం
అక్టోబరు 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోయే గ్రామ సచివాలయాల కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో ఇన్‌చార్జి మంత్రుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఏదో ఒక మండలంలోని ఒక గ్రామ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో జరిపించాలని అందుకనుగుణంగా జిల్లా కలెక్టర్‌ ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రితో మాట్లాడి తగిన ఏర్పాటు చేసుకోవాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ జిల్లా అధికారులను బుధవారం ఆదేశించారు.  

మరిన్ని వార్తలు